ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు భేష్
ABN , Publish Date - May 17 , 2026 | 12:41 AM
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తృతంగా అందుతున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే పురోగతి గణనీయంగా పెరిగింది. ఆస్పత్రికి వచ్చిన ప్రతీ కేసును ఈ పథకంలో చేయడం ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు సమకూర్చుతున్నారు.
- నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో పురోగతి
- గత రెండేళ్లతో పోలిస్తే మెరుగు
- ఈ ఏడాది నాలుగు నెలల్లో 6,556 మందికి చికిత్సలు
- ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి నగదు ప్రోత్సాహం
- ఆస్పత్రి అభివృద్ధి పనులకు వినియోగం
నర్సీపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తృతంగా అందుతున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే పురోగతి గణనీయంగా పెరిగింది. ఆస్పత్రికి వచ్చిన ప్రతీ కేసును ఈ పథకంలో చేయడం ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు సమకూర్చుతున్నారు.
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో జనరల్ సర్జరీలు, చిన్న పిల్లల జబ్బులు, గైనికాలజీ సిజేరియన్లు, కడుపులో కణితి, గర్భసంచి ఆపరేషన్లు, ఎముకల శస్త్ర చికిత్సలు, ఈఎన్‌టీ విభాగంలో సర్జరీలు, కంటి ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్‌లో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో చికిత్సలు అందిస్తున్నారు. ఈ పథకంలో వైద్య సేవలు చేసినందుకు ఆయా ఆపరేషన్లకు ఎంత ఖర్చు అవుతుందో అది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి ఏరియా ఆస్పత్రికి జమ చేస్తారు. ఈ విధంగా వచ్చిన నగదు 45, 55 నిష్పత్తిలో 45 శాతం వైద్య సేవలు అందించిన సిబ్బందికి, 55 శాతం ఆస్పత్రి అభివృద్ధికి జమ అవుతుంది. ఈ నిధులు ఆస్పత్రి అభివృద్ధికి వినియోగిస్తున్నారు.
నాలుగు నెలల్లో 6,556 మందికి చికిత్స
ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల వ్యవధిలో 6,556 మందికి చికిత్సలు అందించడం విశేషం. 2024 కంటే 2025లో వైద్య సేవల పురోగతి రెట్టింపు అయితే, 2026లో అంతకు మించి అభివృద్ధి కనిపిస్తోంది. 2024లో గైనికాలజీ విభాగంలో 1908, చిన్న పిల్లలకు 495, జనరల్ సర్జరీ 243, జనరల్ మెడిసిన్ 628, చర్మవ్యాధులు 97, ఎముకల ఆపరేషన్లు 107, ఈఎన్‌టీ 169, కంటి ఆపరేషన్లు 48.. మొత్తం 3695 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అదే విధంగా 2025లో గైనికాలజీ 2,526, చిన్నపిల్లలు 1,651, జనరల్ సర్జరీ 275, జనరల్ మెడిసిన్ 1,086, చర్మవ్యాధులు 113, ఎముకల శస్త్ర చికిత్సలు 251, ఈఎన్‌టీ 47, కంటి ఆపరేషన్లు 143.. మొత్తం 6,092 మందికి చికిత్సలు అందించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 6,556 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో చికిత్స అందించారు. ఇందులో గైనికాలజీ విభాగంలో 2,993, చిన్నపిల్లలు 1,303, జనరల్ సర్జరీ 689, జనరల్ మెడిసిన్ 913, చర్మవ్యాధులు 126, ఆర్థోపెడిక్ 264, ఈఎన్‌టీ 72, కంటి ఆపరేషన్లు 196 చేశారు. రెండేళ్లలో వైద్య సేవలు పెరగడంతో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి వస్తున్న నగదు ప్రోత్సాహం కూడా అదే స్థాయిలో రావడం గమనార్హం. ఈ నిధులు ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు, మరమ్మతులకు ఉపయోగిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద తెలిపారు.