ఎన్టీఆర్ వ్యక్తి కాదు.. మహా శక్తి
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:23 PM
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదని... మహా శక్తి అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
బలిఘట్టంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్న
నర్సీపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదని... మహా శక్తి అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలిసి బలిఘట్టం బీసీ కాలనీలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం నుంచి నాతవరం మండలం గన్నవరపుమెట్ట వరకు రూ.7.2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయం వద్ద అసంపూర్తిగా ఉన్న కల్యాణ మండపం పనులను రూ.75 లక్షలతో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాల వంటి ఎన్నో అభివృద్ధి పనులకు ఎన్టీఆర్ సహకరించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.400 కోట్లతో నర్సీపట్నాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టింది టీడీపీ అని, తుది శ్వాస వరకు ఇందులోనే కొనసాగుతానని, మరణించినప్పుడు పార్టీ జెండా కప్పుకునేపోతానని అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో సార్లు పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, తనకు జీవితం ఇచ్చింది ఎన్టీఆర్ అని, టీడీపీని వీడి రానని చెప్పానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి లాలం కాశీనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, పార్టీ మండలాధ్యక్షుడు సుకల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.