అనకాపల్లికి ఎన్‌ఆర్‌సీ
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:07 AM
అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి పోషకాహార పునరావాస కేంద్రం (న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్- ఎన్‌ఆర్‌సీ) మంజూరైంది.
ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోషకాహార పునరావాస కేంద్రం
మొదటి అంతస్థులో మొదలైన నిర్మాణ పనులు
పది పడకలతో త్వరలో అందుబాటులోకి
పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం...
అనకాపల్లి టౌన్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి పోషకాహార పునరావాస కేంద్రం (న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్- ఎన్‌ఆర్‌సీ) మంజూరైంది. దీనిని ఏర్పాటు చేయడానికి ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో కొంత భాగాన్ని కేటాయించారు. సుమారు పది పడకలతో ఏర్పాటు చేసే ఈ కేంద్రం పనులు మొదలయ్యాయి.
పిల్లలకు పోషకాహారం అందించేందుకు నేషనల్ హెల్త్ మిషన్ ఎప్పటికప్పుడు పలు రకాల చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో అధిక పోషకాహార లోపం వున్నట్టు ఎన్‌ఐఎన్ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. దీంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాడేరు, నర్సీపట్నం ఆస్పత్రుల్లో ఇప్పటికే పోషకాహార పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆస్పత్రిలో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై వైద్యాధికారులు కొంతకాలంపాటు తర్జనభర్జన పడ్డారు. చివరకు వైద్యాలయం మొదటి అంతస్థులోని సమావేశమందిరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించారు.
ఒకటి నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో సరైన పోషకాహారం అందని, బరువు తక్కువ వున్న వారిని ఈ కేంద్రంలో చేర్చి, పుష్టికరమైన ఆహారాన్ని అందజేస్తారు. పోషకాహారమంతా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా సరఫరా అవుతుంది. ఈ కేంద్రంలో వున్న పిల్లలు ఆడుకోవడానికి క్రీడా సామగ్రిని కూడా అందుబాటులో ఉంచుతారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగి, నిర్ణీత బరువు పెరిగిన తరువాత ఇళ్లకు తిరిగి పంపిస్తారు. మొత్తం పది పడకలు వుండే పోషకాహార పునరావాస కేంద్రం అతిత్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.
డోజ్కోకు 150 ఎకరాలు
రాచపల్లిలో భూమిని అప్పగించిన ఏపీఐఐసీ అధికారుల
మాకవరపాలెం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధిలో 150 ఎకరాలను ఏపీఐఐసీ అధికారులు ప్రముఖ ఎర్త్ మూవర్స్ కంపెనీ ‘డోజ్కో’కు అప్పగించారు. ఇటీవల రాచపల్లి రెవెన్యూ పరిధి 737 సర్వే నంబరులో పరిశ్రమల ఏర్పాటు కోసం 406 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూమిని ఏపీఐఐసీ తీసుకుంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో ‘డోజ్కో’ కంపెనీ ముందుకు వచ్చి, రూ.1,250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అయితే 737 సర్వే నంబరులో వున్న భూములను చాలా ఏళ్ల నుంచి స్థానిక పేద రైతులు సాగు చేసుకుంటుండడంతో వారి వినతి మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమావేశం ఏర్పాటు చేసి ఎకరాకు రూ.9 లక్షల చొప్పున పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇందుకు రెవెన్యూ అధికారులు అడ్డుపుల్ల వేశారు. ప్రభుత్వం భూమికి పరిహారం ఇవ్వడం ఏమిటంటూ కొర్రీ వేశారు. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడి సాగుదారులకు పరిహారాన్ని, డోజ్కో కంపెనీ ద్వారా మంజూరు చేయించారు. అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవడంతో 737 సర్వే నంబరులో డోజ్కో కంపెనీకి కేటాయించిన 150 ఎకరాలకు సంబంధించి సోమవారం సరిహద్దులు ఏర్పాటు కంపెనీకి అప్పగించారు. దీంతో డోజ్కో కంపెనీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా రాచపల్లి ప్రాంతంలోనే 450 ఎకరాల్లో బ్లాక్‌స్టోన్ కంపెనీ ఏర్పాటుకు భూమిని పరిశీలిస్తున్నారు.
రాష్ట్రస్థాయి హాకీ విజేత అనకాపల్లి
ఫైనల్ మ్యాచ్ వర్షార్పణంతో అన్నమయ్య జిల్లాతో కలిసి సంయుక్తంగా ఎంపిక
ధర్మవరం/ ఎలమంచిలి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నీలో అనకాపల్లి, అన్నమయ్య జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను 12 నుంచి 15వ తేదీ వరకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించారు. సోమవారం వర్షం వల్ల అనకాపల్లి, అన్నమయ్య జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగలేదు. లీగ్ కమ్ నాకౌట్ విధానంలో జరిగిన ఈ పోటీల్లో ముందు జరిగిన మ్యాచ్‌లలో ఆయా జట్లు సాధించిన పాయింట్ల ఆధారంగా అనకాపల్లి, అన్నమయ్య జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ట్రోఫీ, షీల్డ్, ప్రశంసాపత్రాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతులమీదుగా అందజేశారు. అనకాపల్లి జట్టుకు చెందిన కొల్లి హర్షకమల్‌తోపాటు శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఇద్దరికి బెస్ట్‌ప్లేయర్ అవార్డులు అందజేశారు.
అనకాపల్లి జిల్లా ఏర్పడిన తరువాత సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతగా నిలవడం ఇదే ప్రథమమని జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్‌కొఠారు నరేశ్ తెలిపారు. కెప్టెన్ సుంకర ఆనంద్‌తోపాటు జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు.