ఇక ఏఐ నిఘా!
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:38 AM
నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు చెక్‌పెట్టనున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్
రూ.99.19 కోట్లతో ప్రాజెక్టు సారథికి ప్రభుత్వ ఆమోదం
రూ.20 కోట్ల చొప్పున భరించనున్న జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ
సీఎస్‌ఆర్ ద్వారా మరో రూ.20 కోట్ల సేకరణ
ఐదేళ్ల నిర్వహణకు ఈ-చలాన్‌ల నుంచి రూ.39.19 కోట్లు
101 కూడళ్లలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలు
300 అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు
డ్రంకన్‌డ్రైవ్ మినహా అన్ని ఉల్లంఘనలపై నిఘా
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు చెక్‌పెట్టనున్నారు. ప్రాజెక్ట్ సారథి పేరుతో రూ.99.19 కోట్ల వ్యయంతో నగరంలో ఆరిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రాజెక్టు అమలుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించేందుకు జీవీఎంసీ టెండర్లు పిలవనుంది.
నగర పోలీస్‌కమిషనరేట్ పరిధిలో ఏటా 1,500కి పైగా రోడు ్డప్రమాదాలు జరుగుతున్నాయి. సగటున 400 మంది ప్రాణాలు కోల్పోతుండగా, 1,200 మంది వరకు క్షతగ్రాతులవుతున్నారు. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇనార్బిట్‌మాల్, ఐటీ కంపెనీలు, భవిష్యత్తులో గూగుల్‌డేటా సెంటర్ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల జనాభాతోపాటు వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య నగరవాసులతో పాటు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో సిగ్నల్‌పడితే చాలు కిలోమీటరు పొడవున వాహనాలు బారులు తీరుతున్నాయి. మధురవాడ కార్‌షెడ్, హనుమంతవాక, సత్యం జంక్షన్ వద్ద కూడలి దాటడానికి అష్టకష్టాలు పడాల్సిందే. దీంతో వేగంగా వెళ్లిపోవాలనే ఆత్రుతలో వాహన చోదకులు ట్రాఫిక్‌సిగ్నల్స్‌ను పట్టించుకోవడం లేదు. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది. మరోవైపు పోలీసులు ఎన్నికేసులు రాస్తున్నా, అవగాహన కల్పిస్తున్నా సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, వన్‌వేలో రాకపోకలు సాగిపోతున్నాయి. దీంతో నగరంలో రోడ్డు ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సమర్థంగా అడ్డుకట్టవేసేందుకు ఏఐతో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను కూడళ్లలో ఏర్పాటుచేయాల్సి ఉందని సీపీ శంఖబ్రతబాగ్చి గుర్తించి, నిధులు సమకూర్చాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌ను కోరారు.
ప్రాజెకుకు రూ.99.19 కోట్లు
నగరంలో 101 ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని గుర్తించిన ఏజెన్సీలు దీనికోసం రూ.99.19 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాయి. అందులో రూ.60 కోట్లు కెమెరాల ఏర్పాటు, కేబుల్స్ అనుసంధానం కోసం కాగా మిగిలిన రూ.39.19 కోట్లు ప్రాజెక్టును ఐదేళ్లపాటు నిర్వహించడానికి లెక్కించారు. ఈ మొత్తం రూ.60 కోట్లలో జీవీఎంసీ రూ.20 కోట్లు, వీఎంఆర్‌డీఏ రూ.20 కోట్లు సమకూర్చేందుకు ముందుకువచ్చాయి. మిగిలిన రూ.20 కోట్లు సీఎస్‌ఆర్ కింద సమకూర్చేందుకు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ వివిధ కంపెనీలు, సంస్థలతో మాట్లాడారు. ప్రాజెక్టుని ఐదేళ్లపాటు నిర్వహించేందుకు అవసరమైన మొత్తాన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలపై వసూలుచేసే జరిమానా మొత్తం నుంచి వెచ్చించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమమయింది.
కారులో కూర్చొని సెల్‌ఫోన్ మాట్లాడినా
ఐటీఎంఎస్ అందుబాటులోకి వస్తే ఏఐ సహాయంతో పనిచేసే సీసీ కెమెరాలు చిన్నపాటి ఉల్లంఘనలను కూడా గుర్తించి వాహనం యజమానికి ఈ-చాలాన్ జారీ చేసేస్తుంది. నగరంలో పోలీసులు నిర్దేశించిన వేగపరిమితికి మించి వాహనం నడిపినా, సిగ్నల్ జంపింగ్‌కు పాల్పడినా, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్‌లేకుండా వాహనం నడిపినా, సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా కారు నడుపుతున్నా, కారులో కూర్చొని ఫోన్ మట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, నంబర్‌ప్లేట్ ఆర్‌టీఏ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా, పోలీసు రికార్డులో రౌడీషీటర్లు, ప్రమాదకర వ్యక్తులు, అనుమానితులుగా నమోదైన వారి ముఖాలను ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం కలిగిన కెమెరాలు పసిగట్టేస్తాయి. వీటన్నింటిపై ఆటోమెటిక్‌గా జరిమానా విధిస్తూ వాహనం నంబరు ఆధారంగా యజమానికి ఈ-చలాన్ జారీ, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు అందజేస్తాయి.
త్వరలో టెండర్లు
ప్రాజెక్టు సారథికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. మొత్తం ఖర్చుని జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, సీఎస్‌ఆర్ ద్వారా సమానవాటాలుగా వెచ్చిస్తాం. ఐదేళ్ల నిర్వహణకు ఈ-చాలాన్‌ల ద్వారా వసూలుచేసే మొత్తం నుంచి ఖర్చుచేస్తాం. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నగరంలో వాహన చోదకులంతా క్రమశిక్షణతో వాహనాలు నడుపుతారని ఆశిస్తున్నాం. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాలను గణనీయంగా తగ్గించేందుకు వీలుంటుంది.
- కేతన్‌గార్గ్, జీవీఎంసీ కమిషనర్