Share News

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేడు

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:04 AM

పంచాయతీలకు సంబంధించి తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం జారీ కానుంది. జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తారనే విషయం పాఠకులకు తెలిసిందే.

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేడు
చింతపల్లి పంచాయతీ కార్యాలయం

- 15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ

- 26న 66 పంచాయతీలు, 686 వార్డులకు ఎన్నికలు

పాడేరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలకు సంబంధించి తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం జారీ కానుంది. జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తారనే విషయం పాఠకులకు తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఈ నెల 26, రెండవ విడత 29, మూడవ విడత ఎన్నికలు డిసెంబరు 2న నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. అయితే తొలి విడతగా జిల్లాలోని చింతపల్లి మండలంలో 17 పంచాయతీలు, 204 వార్డులు, జీకేవీధిలో 16 పంచాయతీలు, 188 వార్డులు, కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలు 294 వార్డులు, మొత్తం 66 పంచాయతీలు, 686 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.

తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే...

- మొదటి విడతలో... : చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 66 పంచాయతీలు, 686 వార్డులకు ఎన్నికలు

- ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్‌, 15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ

- ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన, 19న అభ్యంతరాల స్వీకరణ, 20న వాటి పరిష్కారం

- ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ, 26న ఎన్నికలు, అనంతరం ఓట్ల లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.

- అవసరాన్ని బట్టి ఈ నెల 27న రీపోలింగ్‌ నిర్వహిస్తారు.

Updated Date - Nov 13 , 2026 | 01:04 AM