పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:56 AM
జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. జిల్లాలో మొత్తం 646 గ్రామ పంచాయతీలు వుండగా.. రాంబిల్లి మండలంలోని నాలుగు పంచాయతీల్లో (అప్పారాయుడుపాలెం, ఎం.చింతువ, పంచదార్ల, జడ్.చింతువ) కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించడంలేదు.
జిల్లాలో మూడు దశల్లో పోలింగ్
పంచాయతీలు- 642, వార్డులు- 6,258
మొదటి దశ ఎన్నిలకు 15 నుంచి నామినేషన్ల స్వీకరణ
డివిజన్ పంచాయతీలు వార్డులు
అనకాపల్లి 273 2,674
నర్సీపట్నం 182 1,762
అడ్డరోడ్డు జంక్షన్ 187 1,822
మొత్తం 642 6,258
-----
అనకాపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. జిల్లాలో మొత్తం 646 గ్రామ పంచాయతీలు వుండగా.. రాంబిల్లి మండలంలోని నాలుగు పంచాయతీల్లో (అప్పారాయుడుపాలెం, ఎం.చింతువ, పంచదార్ల, జడ్.చింతువ) కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించడంలేదు. మిగిలిన 642 పంచాయతీల సర్పంచులు, 6,258 వార్డు పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ ఎన్నికల్లో 12,28,254 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు దశల్లో నిర్వహించే ఈ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ జరిగే అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీల సర్పంచ్, వార్డు పదవులకు నామినేషన్ల స్వీకరణ 15వ తేదీ ఆదివారం నుంచి మొదలుకానున్నది. ఆయా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండో దశలో పోలింగ్ జరిగే నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని పంచాయతీల్లో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, మూడో దశలో ఎన్నికలు జరిగే అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లోని పంచాయతీల్లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.