‘రాసా’కు నోటీసులు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:19 AM
జీవీఎంసీ పరిధిలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్)లలో ఉన్న క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ‘రాసా’ సంస్థపై ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
రెండు సీసీఎస్ ప్లాంట్లలో
తక్షణం పనులు ప్రారంభించాలని ఆదేశం
లేనిపక్షంలో చీమలాపల్లి ప్లాంటును టెండర్లలో ఎల్ 2గా నిలిచిన కాంట్రాక్టర్‌కు అప్పగించి,
టౌన్‌కొత్తరోడ్డు ప్లాంటుకు మళ్లీ టెండర్లు పిలుస్తామని హెచ్చరిక
ఆ సంస్థకు టెండర్ల కేటాయింపు రద్దు చేయాలని అధికారుల సిఫారసు
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్)లలో ఉన్న క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ‘రాసా’ సంస్థపై ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. చీమలాపల్లి, టౌన్‌కొత్తరోడ్డులోని సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణ టెండర్లను ‘రాసా’ సంస్థ దక్కించుకున్నప్పటికీ పనులు ప్రారంభించకుండా తాత్సారం చేస్తోంది. అలాగే గాజువాక సీసీఎస్ ప్రాజెక్టు నిర్వహణను ఆ సంస్థ చూసేది. ఇటీవల టెండర్ పిలవగా వేరొక సంస్థ దక్కించుకుంది. అయితే ప్లాంటును ‘రాసా’ అప్పగించకపోవడంతో అక్కడ కూడా పని నిలిచిపోయింది. దీనివల్ల టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లి జీటీఎస్ స్టేషన్‌ల నుంచి చెత్త హుక్‌లోడర్ల ద్వారా కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించే ప్రక్రియ ఆగిపోవడంతో చెత్తకుప్పలుగా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీవీఎంసీ అధికారులే ప్రైవేటు టిప్పర్లను అద్దెకు తీసుకుని చెత్తను కాపులుప్పాడలోని యార్డుకు తరలిస్తున్నారు. ఇది జీవీఎంసీకి ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణం కలుషితమవుతోంది. దీనిపై ‘చెత్తశుద్ధి కరవు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం కథనం ప్రచురించడంతో జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు స్పందించారు. చీమలాపల్లి, టౌన్‌కొత్తరోడ్డు జీటీఎస్ కేంద్రాల్లోని సీసీఎస్ ప్లాంట్లలో తక్షణం పని ప్రారంభించాలంటూ ‘రాసా’ సంస్థకు నోటీస్ జారీచేశారు. లేనిపక్షంలో చీమలాపల్లి సీసీఎస్ ప్లాంటు నిర్వహణను టెండర్లలో ఎల్ 2గా నిలిచిన కాంట్రాక్టర్‌కు అప్పగించి, టౌన్‌కొత్తరోడ్డులోని సీసీఎస్ ప్లాంటు నిర్వహణకు మళ్లీ కొత్తగా టెండర్ పిలుస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు రాసా టెండర్లు రద్దు చేయాలని సిఫారసు చేస్తూ ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్‌కు ఫైల్ పంపించారు. కమిషనర్ సీరియస్‌గా తీసుకుంటే ‘రాసా’ టెండర్లు రెండు,మూడు రోజుల్లో రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.