Share News

ఆస్తి పన్నుకు నోటీసులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:25 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఆస్తి పన్ను వసూళ్లకు కొత్త విధానం అనుసరిస్తోంది.

ఆస్తి పన్నుకు నోటీసులు

లోక్‌ అదాలత్/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇంటింటికీ జారీ

పన్ను కట్టిన వారికి సైతం...

కోర్టు కేసులపై విస్మయం

జీవీఎంసీ అధికారుల వింత పోకడ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఆస్తి పన్ను వసూళ్లకు కొత్త విధానం అనుసరిస్తోంది. ప్రజలను భయపెట్టి పన్ను కట్టించుకోవడానికి ‘లోక్‌ అదాలత్‌’ ద్వారా నోటీసులు ఇప్పిస్తోంది. పూర్తి పన్ను చెల్లించిన వారికి సైతం ఈ నోటీసులు ఇవ్వడం మరో విశేషం.

ఆస్తి పన్ను వసూలు కోసం జీవీఎంసీ సిబ్బంది గతంలో ఇంటికి వచ్చి డిమాండ్‌ నోటీసులు ఇచ్చేవారు. ఈ విధానానికి కొన్ని దశాబ్దాల క్రితమే స్వస్తి చెప్పేశారు. దాంతో గుర్తున్నవారు కట్టడం, లేనివారు మరిచిపోవడం జరుగుతోంది. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. వాటిని వసూలు చేసుకోవడానికి ఏడాది ఆఖరులో ‘ఒకేసారి బకాయిలు కడితే వడ్డీ రాయితీ’ అంటూ ప్రకటిస్తోంది. అప్పుడు కూడా కొందరు కడుతున్నారు. మిగిలినవారు కట్డడం లేదు. ఈ నేపథ్యంలో బకాయిదారులనుగుర్తించి, ఎలా పన్నులు వసూలు చేసుకోవాలో కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికారులకు అంత తీరిక లేకపోవడంతో అందరినీ ఒకే గాటన కట్టేసి కోర్టు గుమ్మం ఎక్కించేశారు. ఇది ఏ అధికారికి వచ్చిన ఆలోచనో తెలియదు గానీ ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది. లోక్‌అదాలత్‌ నిర్వహించే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కోర్టు నోటీసులను ఇంటింటికీ పంచుతున్నారు. వీటిని చూసి ఇళ్ల యజమానులు గతుక్కుమంటున్నారు.

కేసు నంబరు వేసి మరీ పంపిణీ

ఎవరి మధ్య అయినా వివాదం తలెత్తి అది పరిష్కారం కాకపోతే ఇరుపక్షాల్లో ఒకరు కోర్టుకు వెళతారు. అప్పుడు కోర్టు దానిని కేసుగా నమోదు చేసుకొని ఒక నంబరు వేసి నోటీసు ఇస్తుంది. కానీ ఇప్పుడు జీవీఎంసీ 2027 మార్చి వరకు పూర్తిగా పన్ను కట్టిన వారిపై సైతం లోక్‌ అదాలత్‌లో కేసులు వేసి నోటీసులు జారీచేస్తోంది. ఇదే కలకలం రేపుతోంది. ఆరు నెలలకు ఒకసారి చొప్పున జీవీఎంసీ ఏడాదికి రెండుసార్లు ఆస్తి పన్ను వసూలు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు మొదటి అర్ధ సంవత్సరం పూర్తయింది. ఆ పన్ను ఎవరైనా కట్టకుండా ఉంటే వారికి నోటీసులు ఇచ్చారంటే అర్థం ఉంది. అలా కాకుండా రెండో అర్ధ సంవత్సరం అంటే అక్టోబరు నుంచి 2027 మార్చి వరకు పన్ను కట్టిన వారికి కూడా లోక్‌ అదాలత్‌ నోటీసులు ఇస్తున్నారు. డిసెంబరు 12వ తేదీన జిల్లా కోర్టుకు వచ్చి, పన్ను చెల్లింపునకు జరిగిన ఆలస్యానికి కారణాలు వెల్లడించి, అక్కడ పన్ను చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.

ఇలా ప్రతి అసెస్‌మెంట్‌(ఇంటి)కి లోక్‌ అదాలత్‌లో కేసు నమోదుచేసి నోటీసులు ఇస్తున్నారు. దీర్ఘకాలిక బకాయిలు ఉన్నవారికి ఇచ్చారంటే అర్థం ఉంది. రెగ్యులర్‌గా పన్నులు కడుతున్న వారికీ ఇలా ఇవ్వడం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది.

ఉన్నతాధికారులు ఇవ్వమంటేనే ఇచ్చాం

నగరంలోని మద్దిలపాలెం, ఇసుకతోట, అక్కయ్యపాలెం, మధురవాడ, పీఎం పాలెం, మిథిలాపురి వుడాకాలనీ ప్రాంతాల్లో ఇలా నోటీసులు జారీ చేశారు. వీటిపై సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తే...ఉన్నతాధికారులు ఇమ్మంటేనే ఇచ్చామని సమాధానం చెబుతున్నారు. కోర్టులో ఎందుకు కేసు వేశారని ప్రశ్నిస్తే...అవన్నీ తమకు తెలియదంటున్నారు. వెంటనే పన్ను కట్టేసి, ఆ రశీదు ఇస్తే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

కొసమెరుపు

కోర్టుకు వెళ్లి తాము పూర్తి పన్ను కట్టేశామని చెప్పుకోవడానికి జీవీఎంసీ రశీదులు కూడా ఇవ్వడం లేదు. ఎక్కడైనా సచివాలయానికి వెళ్లి పన్ను కడితే రశీదులు ఇవ్వరు. ప్రింటర్‌ పనిచేయడం లేదని సమాధానం వస్తోంది. గత కొన్నేళ్లుగా ఇదే దుస్థితి. ఆన్‌లైన్‌లో పన్ను కట్టి ఆ స్ర్కీన్‌ షాట్‌ సేవ్‌ చేసుకొని, దానిని ప్రింట్‌ తీసుకుంటే తప్ప పన్ను కట్టిన సాక్ష్యం ఉండదు.

Updated Date - Nov 24 , 2026 | 01:25 AM