Share News

గూగుల్‌కు వ్యతిరేకం కాదు

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:45 AM

‘‘విశాఖలో గూగుల్‌ ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ. దానికి మేము వ్యతిరేకం కాదు. మనం ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి.

గూగుల్‌కు వ్యతిరేకం కాదు

పర్యావరణానికి హాని కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం

సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త, పాలక మండలి చైర్మన్‌, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు

స్వామి వారి కోసం ఆలయ భూముల్లో చందనం చెట్ల పెంపకం

సింహాచలం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి):

‘‘విశాఖలో గూగుల్‌ ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ. దానికి మేము వ్యతిరేకం కాదు. మనం ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. డేటా సెంటర్‌కు దేవస్థానం భూములు ఇవ్వడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం’’...అని గోవా గవర్నర్‌, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త, పాలక మండలి చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం కృష్ణాపురంలోని నృసింహవనంలో నూతన పాలక మండలి తొలి సమావేశం జరిగింది. ఈఓ జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు 43 అంశాలతో అజెండాను ప్రవేశపెట్టగా వాటిలో పదకొండింటిని ఏకగ్రీవంగా, మిగిలిన వాటిలో ఒకటి మినహా ఇతర అంశాలన్నింటినీ కొద్దిపాటి చర్చ అనంతరం ఆమోదించారు. సమావేశం అనంతరం చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కొద్దికాలం దేవస్థానం సుప్తావస్థలోకి వెళ్లిందని, దానిని అధిగమించి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నట్టు చెప్పారు. పూర్వపు పాలక మండలితో పోలిస్తే ప్రస్తుత పాలక మండలి సభ్యులకు దైవభక్తి మెండుగా ఉందని గుర్తించానని, దాంతో ఆలయానికి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. స్వామికి పైపూతగా ఉండే చందనం కోసం ముందుచూపుతో చందనం మొక్కలను దేవస్థానం భూమిలోనే పెంచాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పారు. అదేవిధంగా ఇంధన సమస్యలను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అవసరాలకు ఎలక్ట్రిక్‌ వాహనాలను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామన్నారు.

పాలక మండలిలో పలు అంశాలపై చర్చ

పాలక మండలి సమావేశంలో కొందరు సభ్యులు కొన్ని అంశాలపై చర్చించారు. సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయాలు జరిపేలా చూడాలని కోరారు. అదేవిధంగా తాటిపూడి జలాశయం నీటిని సింహగిరికి తీసుకువచ్చే అంశంపై మరింత లోతుగా చర్చ జరగాలని కోరారు. సింహగిరిపై ప్రసాద్‌ పథకం కింద నిర్మించిన మల్టీపర్పస్‌ భవనాన్ని పూర్తిగా దైవిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని కొందరు సూచించారు. అదేవిధంగా శ్రీనివాసనగర్‌లో నిర్మించిన నూతన కల్యాణ మండపాల ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే నిర్ణయించాలని కోరారు. జూలై 28, 29 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు తమ సామగ్రి భద్రపరచుకునేందుకు ప్రత్యేకంగా లాకర్‌ రూమ్స్‌ ఏర్పాటుచేయాలని కోరారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు మాకెన సీతారామ్‌, కసిరెడ్డి దామోదర్‌, చలుమూరి భారతి, కరక దేవుడు, మురళీమోహన్‌, వెంపాడపు అన్నపూర్ణ, బీతాల నీరజా లక్ష్మీ, మధుపాడ సన్యాసిరావు, ధరణి బండ్ల, నీటిపల్లి మహేష్‌, పెద్దిశెట్టి ఉషశ్రీ, లలితా జ్యోతి, గుత్తికొండ శ్రీలత, సుతారపు గణపతిరావు, చల్లంగి జ్ఞానేశ్వరి, బావులూరి శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులు బోకం స్వామినాయుడు, వేదుల దక్షిణామూర్తి, తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు నృసింహవనంలోని డాక్టర్‌ పీవీజీ రాజు విగ్రహానికి గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - Jun 28 , 2026 | 12:45 AM