అభ్యర్థి కాదు.. గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:38 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, పార్టీ గెలుపే లక్ష్యమనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు చేరవేసింది.
స్థానిక ఎన్నికలకు టీడీపీ కసరత్తు
అరకులోయలో సమావేశమైన పార్టీ యంత్రాంగం
ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
మంత్రి సంధ్యారాణి, పరిశీలకులు రాజశేఖర్ పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం
అరకులోయ,సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, పార్టీ గెలుపే లక్ష్యమనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు చేరవేసింది. ఇందుకోసం అరకులోయలోని ప్రైవేటు రిసార్టులో గురువారం అరకులోయ, పాడేరు నియోజకవర్గాల పార్టీ నేతలు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, ప్రధాన నాయకులు, మండల పార్టీ అధ్యక్షులతో రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే పెరబత్తుల రాజశేఖర్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, పార్టీ పాడేరు, అరకులోయ ఇన్‌చార్జిలు గిడ్డి ఈశ్వరి, సియ్యారి దొన్నుదొర సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని 11 మండలాల నుంచి 60 వరకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే కొత్తగా ఏర్పడనున్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారి గురించి కూడా ఆరా తీశారు. సుమారు 20 మంది వరకు జడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ, కూటమి అభ్యర్థుల విజయంపై టీడీపీ నాయకులకు మంత్రి సంధ్యారాణి, పరిశీలకులు రాజశేఖర్ దిశా నిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కాదని, పార్టీ గెలుపు కోసం నాయకులంతా సమిష్టిగా పనిచేయాలన్నారు. ఆశావహుల దరఖాస్తులను పార్టీ అధిష్ఠానానికి అందజేస్తామని, వాటిని పరిశీలించిన అనంతరం ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు. పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటిస్తుందో.. వారిని మండల నేతలు, క్యాడర్ గెలిపించి తీరాలని స్పష్టం చేశారు. కుమ్ములాటలు, కొట్లాటలు, అసంతృప్తులకు తావులేకుండా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలే తప్ప అభ్యర్థిని చూడకూడదన్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని, పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు అందరూ సమిష్టిగా పనిచేసి, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.