Share News

ఎండాడ భూవివాదంలో సర్వే అధికారులకు బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:53 AM

ఎండాడ సర్వే నంబర్‌ 13లో గల భూమికి సంబంధించి సర్వేలో అవకతవకలు జరిగినట్టు విచారణాధికారి గుర్తించారు.

ఎండాడ భూవివాదంలో సర్వే అధికారులకు బిగుస్తున్న ఉచ్చు

డీడీ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ల తప్పిదాలు గుర్తించిన ఉన్నతాధికారి

ఎఫ్‌ఎంబీలో కొట్టివేతలు, దిద్దుబాట్లు

జూమ్‌ సర్వేకు సిఫారసు

విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

ఎండాడ సర్వే నంబర్‌ 13లో గల భూమికి సంబంధించి సర్వేలో అవకతవకలు జరిగినట్టు విచారణాధికారి గుర్తించారు. భూమి విస్తీర్ణం తప్ప ఇతర విషయాల జోలికి వెళ్లకూడదని తెలిసినా ఒత్తిడికి తలొగ్గి సర్వే అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయంలో సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమణమూర్తి, డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌ కొండలరావు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఇప్పటికే నిర్ధారించారు. ఎండాడలో భూమాయపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో జిల్లా యంత్రాంగం స్పందించి విచారణాధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడును నియమించింది.

సర్వే నంబరు 13లో నాలుగు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. కొంత హౌసింగ్‌ బోర్డుకు, ఇతర అవసరాలకు కేటాయించారు. అయితే 13/4లో భూమి తమదని ప్రైవేటు వ్యక్తులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో 13/4పై సర్వే చేయాలని భావించినా పలు కారణాలతో పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో 13/4పై సర్వే చేయాలని సర్వే శాఖ ఏడీని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే సర్వే శాఖ ఏడీ బదులుగా డిప్యూటీ డైరెక్టర్‌ రమణమూర్తి నేతృత్వంలో డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌ కొండలరావు ఈ ప్రక్రియ నిర్వహించారు. రికార్డుల ప్రకారం భూమి విస్తీర్ణం సరిపోయిందా?, లేదా?...అనేది మాత్రమే సర్వే రిపోర్టులో పేర్కొనాలి తప్ప టైటిల్‌ నిర్ధారించకూడదు. కానీ నిబంధనలు ఉల్లంఘించి సర్వే నివేదికను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీంతో డీడీ రమణమూర్తి, డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లను జేసీ విద్యాధరి సరండర్‌ చేశారు. ఈ విషయం కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్‌ స్పందించి విచారణ చేయాలని డీఆర్వోకు ఆదేశించారు. సర్వే నంబరు 13/4లో భూమిని పరిశీలించిన డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, రూరల్‌ తహశీల్దారు కార్యాలయంలో ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ)లో కొన్ని కొట్టివేతలు, దిద్దుబాట్లు గుర్తించారు. విజయవాడలోని ఆర్కివ్స్‌ శాఖ నుంచి ఎఫ్‌ఎంబీ తెప్పించుకుని సరిపోల్చారు. సర్వేనంబరు 13లో ఉండాల్సిన నాలుగు కంటే ఎక్కువ సబ్‌ డివిజన్లు ఉన్నట్టు పరిశీలనలో తేలింది. దీనిపై మరింత లోతుగా విచారణకు జూమ్‌ సర్వే చేయాలని విచారణాధికారి నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో సర్వేశాఖ డీడీ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌లకు ఉచ్చు మరింత బిగుస్తుందని అంటున్నారు. ఎండాడ భూ సర్వే విషయంలో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Jul 18 , 2026 | 01:53 AM