రూ.60 కోట్లతో నాన్‌రెల్ టెక్నాలజీ ఐటీ క్యాంపస్
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:41 AM
రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నంబరు 2లో ఐటీ క్యాంపస్ నిర్మాణానికి నాన్‌రెల్ టెక్నాలజీ కంపెనీ పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.
ఏడు అంతస్థులతో భవన నిర్మాణం
567 మందికి ఉద్యోగావకాశాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నంబరు 2లో ఐటీ క్యాంపస్ నిర్మాణానికి నాన్‌రెల్ టెక్నాలజీ కంపెనీ పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు గత ఏడాది డిసెంబరు 12న ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించారు. నాలుగు నెలల తరువాత ఆ సంస్థ భవన నిర్మాణానికి ప్రణాళికను సమర్పించింది. నాన్ సెజ్ ఏరియాలో వీరికి ఎకరాభూమిని రూ.8.4 కోట్లకు కేటాయించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ రూ.50 నుంచి 60 కోట్లు పెట్టుబడి పెట్టి, 567 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ భూమిలో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మిస్తామని ప్లాన్ సమర్పించింది. బిల్డప్ ఏరియా 22,077 చ.మీ. కాగా, ఆఫీసుకు ఆరు అంతస్థులు, పైన ఎన్విరాన్‌మెంట్ డెక్‌తో కలిపి మొత్తం ఏడు అంతస్థులు నిర్మించనుంది. ఇవి కాకుండా సెల్లార్, మూడు స్టిల్ట్‌లు కలిపి 8,4242 చ.మీ. వస్తాయి. వీటిని పార్కింగ్‌కు కేటాయిస్తారు. 1,350 మందికి సరిపడేలా సీటింగ్ సామర్థ్యంతో దీనిని నిర్మిస్తారు.
తర్లువాడకు గూగుల్ బృందం
శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలన
పాల్గొన్న భీమిలి ఆర్డీవో, తహశీల్దార్
ఆనందపురం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
గూగుల్ కంపెనీ ప్రతినిధులు శనివారం తర్లువాడలోని ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలించారు. తర్లువాడలో 266.6 ఎకరాలు గూగుల్‌కు కేటాయించగా, మరో 50 ఎకరాలు ఇతర కంపెనీల కోసం ఏపీఐఐసీకి అప్పగించారు. ఈనెల 28వ తేదీన గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అక్కడ భూమి చదునుచేసే పనులు సాగుతున్నాయి. శంకుస్థాపన చేసిన ప్రాంతంలో భారీ సభ నిర్వహించనున్నందున వేదిక, ఇతర ఏర్పాట్లకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే శంకుస్థాపన పనులు పర్యవేక్షించడం, డేటాసెంటర్‌కు సంబంధించి ఇతరత్రా ఏర్పాట్ల పరిశీలనకు గూగుల్ బృందం వచ్చింది. భీమిలి ఆర్డీవో సంగీత్‌మాధుర్, ఆనందపురం తహశీల్దారు శీనుబాబు, ఏపీఐఐసీ అధికారులు బృందం వెంట ఉన్నారు.
కిలో రూ.160
భారీగా పెరిగిన నిమ్మకాయల ధర
ఆరేళ్ల తరువాత రికార్డు స్థాయికి
గోపాలపట్నం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి):
వేసవి నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో నిమ్మకాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రెండు నెలల కొందటి వరకు కిలో కేవలం రూ.50 లభించే నిమ్మకాయలు శనివారం నాటికి రూ.160కి చేరాయి.
వేసవి తీవ్రత పెరగడంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. అంతేకాకుండా దిగుబడి తక్కువగా ఉండడంతో రెండు నెలల వ్యవధిలో నిమ్మకాయల ధర కిలో రూ.110 పెరిగింది. ఆరేళ్ల క్రితం ఇదేస్థాయిలో ధర పలికిందని, మళ్లీ ఇప్పుడు చేరుకుందని వర్తకులు చెబుతున్నారు.
దిగబడి తగ్గడమే కారణం
శీతాకాలంలో శీతలపానీయాల విక్రయాలు అసాధారణంగా తగ్గుమఖం పడతాయి. దీంతో నిమ్మకాయల వినియోగం తగ్గుతుంది. డిసెంబరు, జనవరి నెలల్లో శుభ ముహూర్తాలు లేకపోవడంతో అమ్మకాలు నెమ్మదిస్తాయి. కేటరింగ్ వ్యాపారం కూడా మందకొడిగా సాగుతుంది. దీంతో వినియోగం లేక ఫిబ్రవరి వరకూ నిమ్మకాయల ధర అందుబాటులో ఉంది. వేసవి రాగానే వినియోగం పెరగడంతో నిమ్మకాయల ధర కాస్త పెరుగుతుంది. అయితే డిమాండ్‌కు తగిన దిగుబడి లేకపోవడంతో అమాంతం పెరిగింది. గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి నగరానికి పెద్దమొత్తంలో నిమ్మకాయలు దిగుమతి అవుతాయి. ఆ ప్రాంతాల్లో ఆశించిన మేర దిగుబడి లేక ధర అసాధారణంగా పెరిగిందని చెబుతున్నారు.