Share News

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:49 PM

అల్లూరి సీతామరాజు జిల్లాలో తొలి రోజు ఆదివారం 27 సర్పంచ్‌, 23 వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
తెలుగుదేశం పార్టీ మద్దతుతో రాజేంద్రపాలెం సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేస్తున్న సురబోయిన చిన్ని

తొలిరోజు సర్పంచ్‌ పదవులకు 27, వార్డు పదవులకు 23 దాఖలు

తొలి విడతలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో ఎన్నికలు

పాడేరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతామరాజు జిల్లాలో తొలి రోజు ఆదివారం 27 సర్పంచ్‌, 23 వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో తొలి విడతలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆదివారం నుంచి ఆ మూడు మండలాల్లో నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ఆదివారం చింతపల్లి మండలంలో సర్పంచ్‌ పదవులకు 15, వార్డులకు 9, జీకేవీధిలో సర్పంచ్‌ పదవులకు 6, వార్డులకు 10, కొయ్యూరు మండలంలో సర్పంచ్‌ పదవులకు 6, వార్డులకు 4 నామినేషన్లు దాఖలయ్యాయని డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ తెలిపారు.

చింతపల్లిలో..

మండలంలోని 17 పంచాయతీల్లో తొలి రోజు సర్పంచ్‌ పదవులకు 15, వార్డులకు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఎంపీడీవో లాలం సీతయ్య అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అన్నవరం సర్పంచ్‌ పదవికి ఒకటి, బలపంలో సర్పంచ్‌ పదవికి మూడు, వార్డు పదవులకు రెండు, చింతపల్లిలో సర్పంచ్‌ పదవికి మూడు, వార్డు పదవి ఒకటి, కిటుములలో సర్పంచ్‌ పదవికి ఒకటి, లోతుగెడ్డలో సర్పంచ్‌ పదవికి రెండు, వార్డు పదవికి ఒకటి, పెదబరడలో సర్పంచ్‌ పదవికి మూడు, వార్డు పదవులకు మూడు, తాజంగిలో సర్పంచ్‌ పదవికి ఒకటి, యర్రబొమ్మలులో సర్పంచ్‌ పదవికి ఒకటి, కొత్తపాలెంలో వార్డు పదవికి రెండు నామినేషన్లు పడ్డాయి. ఈకార్యక్రమంలో తహశీల్దార్‌ హనుమంతు త్రివేణి పాల్గొన్నారు.

జీకేవీధిలో..

మండలంలో 16 పంచాయతీలకు తొలిరోజు సర్పంచ్‌ పదవికి ఐదు, వార్డు సభ్యులకు పది నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రమణబాబు తెలిపారు. ఆదివారం తొమ్మిది కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గూడెంకొత్తవీధి సర్పంచ్‌ పదవికి రెండు, వార్డు సభ్యులకు మూడు, వంచులలో సర్పంచ్‌ పదవికి ఒకటి, సంకాడలో సర్పంచ్‌ పదవికి ఒకటి, రింతాడలో సర్పంచ్‌ పదవికి ఒకటి, వార్డులకు ఒకటి, అమ్మవారి ధారకొండలో సర్పంచ్‌ పదవికి ఒకటి, వార్డులకు ఐదు, పెదవలసలో వార్డులకు ఒక నామినేషన్‌ దాఖలయ్యింది. ఇతర పంచాయతీల్లో నామినేషన్లు ఒకటి దాఖలు కాలేదని ఆర్వో తెలిపారు.

కొయ్యూరులో..

మండలంలో 33 పంచాయతీలకు 12 నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు సర్పంచ్‌ స్థానాలకు రాజేంద్రపాలెంలో 2, మంప, మర్రివాడ, శరభన్నపాలెం, వెలగలపాలెంల్లో ఒకొక్క నామినేషన్‌ దాఖలయ్యాయి. అలాగే వార్డు సభ్యులకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో మర్రివాడలో 2, నడింపాలెంలో రెండు నామినేషన్లు వేశారు.

Updated Date - Nov 15 , 2026 | 11:49 PM