నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:45 PM
జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
తొలి విడతలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు
30 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు
66 పంచాయతీలు, 686 వార్డులకు నామినేషన్లు
పాడేరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు మండలాలకు సంబంధించి 66 పంచాయతీలు, 686 వార్డులకు నామినేషన్లను ఈనెల 17 వరకు స్వీకరించనున్నారు. ఒక్కో నామినేషన్ కేంద్రంలో రెండు లేదా మూడు పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించేలా 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోని ఎన్నికల అధికారులు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్పంచ్, వార్డుల అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. చింతపల్లి మండలంలో 17 పంచాయతీలు.. 204 వార్డులు, 9 నామినేషన్ కేంద్రాలు, జీకేవీధిలో 16 పంచాయతీలు..188 వార్డులు, 8 నామినేషన్ కేంద్రాలు, కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలు..294 వార్డులు, 13 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆదివారం నుంచి ఈ మూడు మండలాల్లో నామినేషన్ల సందడి నెలకొంటుంది. చింతపల్లి మండలంలో 65,374 మంది, జీకేవీధిలో 52,412, కొయ్యూరులో 43,711 మొత్తం 1,61,497 మంది ఓటర్లు ఉన్నారు.