గ్రేటర్‌లో ముగిసిన నామినేషన్ల ఘట్టం
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:31 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం బుధవారం సాయంత్రంతో ముగిసింది. బరిలో ఎవరున్నారో లెక్క తేలింది. కూటమి పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను బుధవారం ఉదయం విడుదల చేశాయి. వారికి మాత్రమే బీ ఫారాలు ఇచ్చామని, మిగిలినవారు పోటీ నుంచి తప్పుకోవాలని సూచించాయి. పలు పార్టీల నుంచి కొన్నిచోట్ల నలుగురు నుంచి ఆరుగురు వరకు నామినేషన్లు వేయగా వారందరికీ నచ్చజెప్పి ఒక్కరు మాత్రమే బరిలో ఉండేలా, మిగిలిన వారు వెనక్కి తగ్గేలా నాయకులు మంత్రాంగం నడిపారు. ఈ ప్రయత్నాలు కొంతవరకే ఫలించాయి. కొన్నిచోట్ల రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి
జీవీఎంసీ మేయర్ పదవికి పోటీలో 15 మంది అభ్యర్థులు
కూటమి అభ్యర్థినిగా ముక్కా శ్రావణి
వైసీపీ అభ్యర్థినిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
కాంగ్రెస్ అభ్యర్థినిగా సునందాదేవి
పులిచర్ల, సేనాపతి వసంత నామినేషన్ల ఉపసంహరణ
వార్డుల్లో స్పష్టత కరువు
ప్రచారంలోకి దిగిన అభ్యర్థులు
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం బుధవారం సాయంత్రంతో ముగిసింది. బరిలో ఎవరున్నారో లెక్క తేలింది. కూటమి పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను బుధవారం ఉదయం విడుదల చేశాయి. వారికి మాత్రమే బీ ఫారాలు ఇచ్చామని, మిగిలినవారు పోటీ నుంచి తప్పుకోవాలని సూచించాయి. పలు పార్టీల నుంచి కొన్నిచోట్ల నలుగురు నుంచి ఆరుగురు వరకు నామినేషన్లు వేయగా వారందరికీ నచ్చజెప్పి ఒక్కరు మాత్రమే బరిలో ఉండేలా, మిగిలిన వారు వెనక్కి తగ్గేలా నాయకులు మంత్రాంగం నడిపారు. ఈ ప్రయత్నాలు కొంతవరకే ఫలించాయి. కొన్నిచోట్ల రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మేయర్ పదవికి 29 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో ఎనిమిదింటిని అధికారులు తిరస్కరించారు. ఆ తరువాత బుధవారానికి మరో ఆరుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో మేయర్ స్థానానికి 15 మంది పోటీ పడుతున్నారు. కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి ఉండగా, అదే పార్టీ నుంచి నామినేషన్లు వేసిన సేనాపతి వసంత, పులిచర్ల రాజేశ్వరి విత్‌డ్రా అయ్యారు. వైసీపీ అభ్యర్థినిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బరిలో దిగగా, డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పేడాడ రమణికుమారి, అదే పార్టీ నుంచి నామినేషన్ వేసిన తిప్పల వెంకటవిజయకుమారి ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున దండి ప్రియాంక, దేవరనాగ సునందా దేవి, జెర్రిపోతుల వెంకటలక్ష్మి, ఉస్నారా పర్వీన్‌లు నామినేషన్లు వేయగా నాటకీయ పరిణామాల మధ్య సునందాదేవికి బీ ఫారం ఇచ్చారు. వెంకటలక్ష్మి, ఉస్నారా పర్వీన్‌లు నామినేషన్లు ఉపసంహరించుకోగా దండి ప్రియాంక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బీఎస్‌పీ నుంచి కరణం కీర్తనా గ్రేస్, భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మి భవానీ పోటీ చేస్తున్నారు. వీరు కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా మరో పది మంది...గొంప వెంకట పద్మావతి, అత్తిలి ఫ్యాన్సీనమ్మ, తలుపుల శైలజ, ప్రకృతి దేవిక, బోర సంతోషి, లండ లిఖిత, వాండ్రాసి శాంతి కుమారి, వియ్యపు ఉమా, షేక్ దౌలతున్నీసా, దండి ప్రియాంక పోటీలో ఉన్నారు. వారందరికీ గుర్తులు కేటాయించారు.
ఇక మొత్తం 120 వార్డులకు 1,672 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు వాటిని పరిశీలించి, వివరాలు సరిగా లేని, సరైన పత్రాలు సమర్పించని 31 నామినేషన్లను తిరస్కరించారు. దాంతో 1,641 మాత్రమే ఆమోదం పొందాయి. బుధవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రకటించలేదు.
బీ ఫారం అందుకున్న అభ్యర్థులంతా ప్రచారం ప్రారంభించారు. చాలా తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ ఇంటింటికీ తిరుగుతున్నారు. కూటమి అభ్యర్థిని శ్రావణి గెలుపు కోసం ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. ఆమె భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి దసరా రోజు మంగళవారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకొని అక్కడ ప్రచారం చేశారు. అనంతరం ఎంపీతో కలిసి గాజువాకలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. కార్పొరేటర్ అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు.