సందడే సందడి
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:17 AM
మూడో రోజు అరకు ఉత్సవ్ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన కార్యక్రమాలు ఉత్తేజాన్నిచ్చాయి. ముఖ్యంగా సింగర్ సునీత పాటలకు సభికులు ఫిదా అయ్యారు. పలు రాష్ట్రాల గిరిజన సంస్కృతిని తెలియజెప్పే నృత్యాలు ఆహూతులను అలరించాయి.
అరకు ఉత్సవ్‌లో మూడో రోజూ అదే జోష్..
సింగర్ సునీత పాటలకు సభికులు ఫిదా
గిరిజన సంస్కృతిని ప్రతిబింబించిన నృత్యాలు
అరకులోయ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
మూడో రోజు అరకు ఉత్సవ్ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన కార్యక్రమాలు ఉత్తేజాన్నిచ్చాయి. ముఖ్యంగా సింగర్ సునీత పాటలకు సభికులు ఫిదా అయ్యారు. పలు రాష్ట్రాల గిరిజన సంస్కృతిని తెలియజెప్పే నృత్యాలు ఆహూతులను అలరించాయి.
అరకు ఉత్సవ్ మూడో రోజు శనివారం ఉదయం ప్రధాన వేదిక డిద్రీ కళాశాల వద్ద 5కె రన్‌ను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, ఎమ్మెల్యే మత్స్యలింగం ప్రారంభించారు. మధ్యాహ్నం పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్ షోను అధికారులు, నాయకులు తిలకించారు. ఫ్లవర్ షోలో సందర్శకులు ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. రాత్రి ఏడున్నర గంటలకు ప్రధాన వేదికపై వివిధ రాష్ట్రాల గిరిజన సంప్రదాయ నృత్యాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఛత్తీస్‌గఢ్, అదిలాబాద్ గోండు ట్రైబల్స్, రాజస్థాన్ ప్రాంత గిరిజనుల ప్రదర్శనలు, బస్తర్ ట్రైబల్ డాన్స్‌లు ప్రదర్శించారు, అనంతరం 8.30 గంటలకు సింగర్ సునీత వేదిక వద్దకు రావడంతో జనం కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. సింగర్ సునీతకు అరకుకౌనిలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు తయారు చేసిన మిల్లెట్స్ స్నాక్స్ అందజేశారు. స్నాక్స్ వివరాలను ఐసీడీఎస్ అధికారులు ఆమెకు వివరించారు. కొన్నింటిని రుచి చూసి బాగుందంటూ కితాబు నిచ్చారు. అదేవిధంగా వీవీఐపీలు అందరికి వీటిని అందజేశారు. జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఎస్‌పీ అభిషేక్, ఆర్‌డీవో లోకేశ్, ఆర్‌టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు కుటుంబాలతో హాజరై ఉత్సవ్‌ను తిలకించారు. సింగర్ సునీత పాటలు పాడుతూ జోష్ నింపారు. ఎమ్యూజ్‌మెంట్ పార్కులో పిల్లలు సరదాగా గడిపారు. హాట్ ఎయిర్ బెలూన్‌ను ప్రదర్శనగా పెట్టారు. దీనిని చేసేందుకు పిల్లలు, విద్యార్థులు ఎగబడ్డారు. కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో హెలికాఫ్టర్ రైడ్, పారా మోటారు గ్లైడింగ్ లో పర్యాటకులు, స్థానికులు విహరించి, ఎంజాయ్ చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ఫ్లవర్ షో
అరకు ఉత్సవ్‌లో భాగంగా శనివారం పద్మాపురం గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫ్లవర్ షోను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, పద్మాపురం సర్పంచ్ సుస్మిత సందర్శించారు. ఈ పుష్ప ప్రదర్శనలో 60 రకాల పూలు, పలు రకాల బొకేలతో ఏర్పాటు చేసిన గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా పూల వినాయకుడు, నందులు, పూలవనం మధ్య నెమలి పోలిన ప్రతిమ, ఆ పక్కనే రెండు లవ్ సింబల్ ఆకారాలతో పలు రకాల పూలతో అలంకరించారు. అదే ప్రాంగణంలో రాతివాటర్ ఫౌంటేన్ ఎదుట ఐ లవ్ యూ అరకు పూల బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటి వద్ద కలెక్టర్, పీవో, ఎమ్మెల్యే, దొన్నుదొర, సర్పంచ్ సుస్మిత ఫొటోలు దిగారు. శనివారం కావడంతో పర్యాటకులు ఈ ఫ్లవర్ షోను తిలకించారు.