పెందుర్తి ఎంపీపీపై అవిశ్వాసం
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:02 AM
పెందుర్తి మండలాధ్యక్షురాలు మధుపాడ నాగమణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఆర్డీవోకు ప్రతిపాదనలు అందజేసిన ఎంపీటీసీ సభ్యులు
అభివృద్ధికి ఎంపీపీ సహకరించనందునే ఈ నిర్ణయం: ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలాధ్యక్షురాలు మధుపాడ నాగమణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు నాయకత్వంలో ఎంపీటీసీ సభ్యులు సోమవారం ఆర్డీవో సుధాసాగర్‌ను కలిసి ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి నోటీస్ అందజేశారు. పెందుర్తి అభివృద్ధికి ఎంపీపీ సహకరించడం లేదని, అందుకే అవిశ్వాసానికి ప్రతిపాదించామని, నాలుగేళ్లలో చేయలేని అభివృద్ధి తొమ్మిది నెలల్లో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల చెప్పారు.
అవిశ్వాసం ఇలా..
పెందుర్తి మండల పరిధిలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2021లో జరిగిన మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో వైసీపీకి చెందిన మధుపాడ నాగమణి (ఎస్‌ఆర్‌పురం), గొల్లవిల్లి రమణ (సరిపల్లి), దాడి వరలక్ష్మి (పినగాడి), చిరికి దేవుడు (గొరపల్లి), నందవరపు అప్పలరాజు (పెదగాడి) గండి హిమబిందు (రాంపురం), సైపురాజు స్వప్న (వాలిమెరక), ముదపాక దేవి (రాజయ్యపేట), టీడీపీ నుంచి గండ్రెడ్డి మాలతి (గుర్రమ్మపాలెం) గెలుపొందారు. ఎంపీపీగా ఎస్.ఆర్.పురం ఎంపీటీసీ సభ్యురాలు మధుపాడ నాగమణిని ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు కూటమికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఎంపీపీపై ఆర్డీవోకు అవిశ్వాసం ప్రతులను అందజేశారు. దీంతో మెజారిటీ సభ్యులు ఉండడంతో కూటమి బలపరిచిన ఎంపీటీసీ సభ్యురాలు ఎంపీపీగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే కానుంది.
కాపులకే ఎంపీపీ పదవి?
ప్రస్తుత ఎంపీపీ మధుపాడ నాగమణి కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మహిళను ఎన్నుకోనున్నట్టు తెలిసింది. గుర్రంపాలెం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎంపీటీసీ గండ్రెడ్డి మాలతికి అవకాశం దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది.