దారి లేక అవస్థలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:48 PM
మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ కర్రిమామిడి, పందిరిమామిడి గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్రిమామిడి, పందిరిమామిడి గ్రామస్థుల కష్టాలు
రేషన్ సరుకుల కోసం రానుపోనూ 16 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి
ప్రతిపాదనలకే పరిమితమైన రహదారి నిర్మాణం
అనంతగిరి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ కర్రిమామిడి, పందిరిమామిడి గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరినైనా ఆస్పత్రికి తరలించాలన్నా, రేషన్ సరుకులు తెచ్చుకోవాలన్నా కొండలు, గుట్టలను దాటుకుంటూ దట్టమైన అటవీ ప్రాంతం గుండా ప్రయాణించాల్సిందే. ఈ రెండు గ్రామాల్లో సుమారు 30కి పైగా గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరంతా ప్రతి నెలా రేషన్ సరుకుల కోసం పినకోట పంచాయతీ కేంద్రానికి కాలినడకనే వస్తుంటారు. రానుపోనూ సుమారు 16 కిలోమీటర్లు కాలినడకనే చేరుకోవాల్సి వస్తోందని వారంతా వాపోతున్నారు. బొర్రాపాలెం వై జంక్షన్ నుంచి 4 కిలోమీటర్లు రోడ్డు సౌకర్యం కల్పిస్తే పందిరిమామిడి, కర్రిమామిడి గ్రామాలకు మేలు జరుగుతుంది. రెండేళ్ల క్రితం ఆయా గ్రామస్థులు స్పందనలో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో రోడ్డు నిర్మాణం కోసం అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
రేషన్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
బొర్రాపాలెం గ్రామం వరకు రేషన్ సరుకులు వస్తే అక్కడ నుంచి తీసుకోవడం తమకు సులభమని కర్రిమామిడి, పందిరిమామిడి గ్రామాల గిరిజనులు చెబుతున్నారు. ఈ గ్రామాల నుంచి బొర్రాపాలెం రోడ్డు వరకు 4 కిలోమీటర్లు ఉంటుందని, గత ప్రభుత్వంలో బొర్రాపాలెం వరకు వాహనం వచ్చి సరుకులను సరఫరా చేసేదని వారు తెలిపారు. అయితే ప్రస్తుతం పినకోట వెళ్లి సరుకుల తెచ్చుకునేందుకు రానుపోనూ 16 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీలో బొర్రాపాలెం వరకు మోసుకురావాల్సి వస్తోందని, రోడ్డు సౌకర్యం కల్పిస్తే సమస్యలు ఉండవని వారు చెబుతున్నారు.