Share News

కానరాని జాడ

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:31 AM

సముద్రంలో బోటు బోల్తా పడడంతో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల జాడ ఇంతవరకూ తెలియలేదు.

కానరాని జాడ

ఆచూకీ లేని గల్లంతైన మత్స్యకారులు

కుటుంబీకుల ఎదురుచూపులు

బీచ్‌రోడ్డు, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

సముద్రంలో బోటు బోల్తా పడడంతో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల జాడ ఇంతవరకూ తెలియలేదు. మూడు రోజులుగా అన్వేషిస్తున్నా ఏమాత్రం ఫలితం లేకపోవడంతో అంతా ఆందోళనతో ఉన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతాయని మత్స్య శాఖ కమిషనర్‌ రామశంకర నాయక్‌ ప్రకటించారు. ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారె చిన్నా బోటులో అతనితో పాటు పెద్దన్నయ్య సీతోడు, మరో నలుగురు బంధువులు, ఇంకో స్నేహితుడు మొత్తం ఏడుగురు వేటకు వెళ్లారు. ఈ నెల ఒకటో తేదీన తిరిగి రావలసి ఉంది. అయితే ఇంకో గంటన్నర సమయంలో ఒడ్డుకు చేరుతుందనగా, కెరటాల తాకిడికి గంగవరం పోర్టు సమీపాన బోటు బోల్తాపడింది. దీంతో చిన్నా మినహా మిగిలిన ఆరుగురూ గల్లంతయ్యారు.

ముక్కాం గ్రామానికి చెందిన కారె సత్తయ్యకు నలుగురు పిల్లలు. అందులో పెద్దోడు సీతోడు. ఆఖరి వ్యక్తి చిన్నా. మరొకరు అనారోగ్యంతో చనిపోగా, ఇంకొకరు మంచం పట్టి ఉన్నారు. ఈ దశలో కుటుంబ బాధ్యత అంతా చిన్నాపై పడింది. ఏడాది కిందటి వరకూ చిన్నా బోటు నడిపాడు. నష్టం రావడంతో ఏడాది కాలం కుటుంబ సభ్యులందరితో కలిసి కలాసీగా వెళ్లాడు. అయితే రూ.30 లక్షలు అప్పు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పాత బోటును కొత్త బోటుగా తయారుచేశారు. ఇంజన్‌ కూడా మార్చేశారు. జూన్‌ 15 నుంచి రెండుసార్లు వేటకు వెళ్లివచ్చారు. మూడోసారి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.

అంతా ఒకే కుటుంబం

కారె సత్తయ్య కొడుకుల్లో పెద్ద కొడుకు సీతోడు, ఆఖరి కొడుకు చిన్నా భార్య మసేనమ్మ. మసేనమ్మ చెల్లిని చిన అమ్మోరుకు ఇచ్చారు. అతను కూడా ఈ ప్రమాదంలో గల్లంతయ్యాడు. మరో అన్నయ్య కొడుకు చంటి. అతను, చిన్నా స్నేహితుడు అప్పలరాజు కూడా గల్లంతయ్యారు. చంటికి ఇటీవల పెళ్లయింది. అప్పలరాజు భార్య ఏడు నెలల గర్భిణి. ఇప్పుడు ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

భర్త బతికాడు, చెల్లి భర్త గల్లంతయ్యాడు...

ఇకపోతే మసేనమ్మ చెల్లెల్ని చిన అమ్మోరుకు ఇచ్చారు. అతను కూడా సమ్రుదంలో గల్లంతయ్యాడు. భర్త సురక్షితంగా బయటపడినా చెల్లెలి భర్త కనిపించకపోవడంతో ఆమె బాధ వర్ణనాతీతం. ‘మేము బతికి ఉన్నాం అనుకోవడమే కానీ మాకు జీవం లేదు. మా కుటుంబం అంతా సమ్రుదంలో ఉండిపోయింది.’ అంటూ మసేనమ్మ భోరున విలపిస్తోంది.

ఆ సాయంత్రమే అధికారులకు ఎందుకు చెప్పలేదు?

సంఘాల నేతల తాత్సారం

ప్రమాద సమయంలోనూ కుట్రలేనా?

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

మత్స్యకారుల జీవితాలతోను కొందరు రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన సమయంలో సమాచారాన్ని తొక్కిపెట్టడం దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏడుగురు మత్స్యకారులతో కూడిన బోటు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు గంగవరం పోర్టు సమీపాన బోల్తాపడింది. ఈ విషయం వారి కుటుంబ సభ్యుల ద్వారా ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు మత్స్యకార నాయకులకు వెంటనే తెలిసింది. బాధితులను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే మత్స్య శాఖ అధికారులకో, కలెక్టరేట్‌కో సమాచారం ఇవ్వాలి. ఇది కనీస బాధ్యత. కానీ ఆ పని చేయకుండా గల్లంతైన వారి ఫొటోలు, ఆధార్‌ కార్డులు సేకరించి, మీడియాకు ఆ రాత్రి పది గంటల తరువాత ఇచ్చారు. రాత్రి 11 గంటల వరకు అధికారులకు ఈ విషయం చెప్పలేదు. అర్ధరాత్రి కావస్తుండగా సమాచారం తెలియడంతో అధికారులు ఆ చీకటిలో గాలింపు చర్యలు చేపట్టలేక, తెల్లవారే వరకు ఆగాల్సి వచ్చింది. అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆ మరుసటిరోజు అంటే ఆదివారం ఉదయం నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌తో సహా పలువురు నాయకులు ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుకొని, ‘ఇది ప్రభుత్వ వైఫల్యమని, గాలింపు చర్యల్లో జాప్యం చేశారు’ అంటూ విమర్శలు ప్రారంభించారు. అదే తామైతే రాత్రికి రాత్రి హెలికాప్టర్లు రంగంలోకి దించేవారమని ప్రగల్భాలు పలికారు. శనివారం సాయంత్రమే సమాచారం అందితే అధికారులకు ఎందుకు చెప్పలేదని ఒక్కరూ ప్రశ్నించలేదు. ప్రభుత్వంపై నింద వేయడానికే ఇలా చేశారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. దీనిపై తగిన విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది.

మళ్లీ జరగకుండా తగిన చర్యలు

ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని వెల్లడైంది. ఎవరికైనా ప్రమాదం జరిగితే తొలుత అధికార వర్గాలకు సమాచారం ఇవ్వాలని వేటకు వెళ్లే వారందరికీ తెలియజేయాలి. అలాగే బోట్లకు ప్రభుత్వం అందించిన భద్రతా పరికరాలు జీపీఎస్‌, ట్రాన్స్‌పాండర్‌ వంటివి కచ్చితంగా వాడేలా చూడాలి. ఇలాంటి ఘటనలను రాజకీయాలకు ఉపయోగించుకోవాలని యత్నించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jul 08 , 2026 | 12:31 AM