Share News

ఫ్లైఓవర్లు వద్దు... మెట్రో రైలే ముద్దు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:29 AM

నగరంలో జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల నిర్మాణం కంటే మెట్రో రైలు ప్రాజెక్టు ద్వారానే ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఫ్లైఓవర్లు వద్దు... మెట్రో రైలే ముద్దు

ప్రభుత్వం నిర్ణయం

ప్రాజెక్టు వ్యయం రూ.15 వేల కోట్లు

బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్ల రుణం

కేంద్ర, రాష్ర్టాల వాటా చెరో రూ.3 వేల కోట్లు

రాష్ట్ర వాటా కూడా భరించాలని విజ్ఞప్తి

ప్రాజెక్టు వయబులిటీ నివేదిక కోరిన కేంద్రం

సమాధానం ఇచ్చాకే ప్రాజెక్టు ముందుకు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల నిర్మాణం కంటే మెట్రో రైలు ప్రాజెక్టు ద్వారానే ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే డబుల్‌ డెక్కర్‌ విధానంలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపడతామని పేర్కొంటోంది. నాగపూర్‌, చెన్నైలలో మాదిరిగా కింద వాహనాలు, పైన మెట్రో రైలు వెళ్లేలా డిజైన్‌ చేయించామని చెబుతోంది.

తొలి దశలో 46 కి.మీ. నిర్మాణం

మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో 46 కి.మీ. పొడవున చేపడతారు. అందులో స్టీల్‌ ప్లాంటు (కూర్మన్నపాలెం) నుంచి కొమ్మాది వరకు 34.41 కి.మీ. ఒక కారిడార్‌, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్‌ వరకూ 5.07 కి.మీ. పొడవున రెండో కారిడార్‌, తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కి.మీ. మూడో కారిడార్‌ నిర్మిస్తారు. ఇందులో 20 కి.మీ. పొడవున డబుల్‌ డెక్కర్‌ నిర్మిస్తారు. ఆ మార్గంలో కిందన వాహనాలు, పైన మెట్రో రైలు వెళతాయి. ఇందులో తాటిచెట్లపాలెం నుంచి కొమ్మాది వరకు 15 కి.మీ. ఒక విభాగంగా, కూర్మన్నపాలెం నుంచి గాజువాక వరకు 5. కి.మీ. మరో భాగంగా డబుల్‌ డెక్కర్‌ వేస్తారని సమాచారం. నగరంలో సైడ్‌ మెట్రో లైన్లుగా పేర్కొంటున్న గురుద్వారా-పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చిన్నవాల్తేరు మార్గాలు సాధారణ మెట్రో ట్రాక్‌ మాత్రమే ఉంటుంది. వాటిపై డబుల్‌ డెక్కర్‌ ఉండదు.

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.15 వేల కోట్లు

విశాఖపట్నం ప్రజా ప్రతినిధుల మాటల ప్రకారం డబుల్‌ డెక్కర్‌తో కలుపుకొని మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.15 వేల కోట్లు. అందులో 60 శాతం అంటే రూ.9 వేల కోట్లు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకుంటారు. మిగిలిన 40 శాతం కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం సమకూర్చాలి. రాష్ట్రం వాటాగా రూ.3 వేల కోట్లు పెట్టాల్సి ఉంది. ఈ మొత్తం కూడా కేంద్రమే సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. అక్కడ ఓకే చేస్తేనే ఇక్కడ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది.

రెండు వారాల క్రితం ఢిల్లీలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. విశాఖ మెట్రోపై మాత్రం కొర్రీలు వేసినట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ఎంత వరకు లాభదాయకమో రిపోర్ట్‌ ఇవ్వాలని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మెట్రోలో ఎంత ట్రాఫిక్‌ ఉంటుంది?, దానివల్ల ఆదాయం ఎంత వస్తుంది?, నిర్వహణ వ్యయం ఎంత అవుతుంది?, ఎంత కాలానికి బ్రేక్‌ ఈవెన్‌ సాధించి లాభాల్లోకి వస్తుంది?...తదితర వివరాలు కోరినట్టు తెలిసింది. దీనిపై మెట్రో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ కంటే అనేక రెట్లు పెద్దదైన హైదరాబాద్‌ నగరంలోనే మెట్రో రైలు ప్రాజెక్టు లాభదాయకంగా లేదని నిర్వహణ సంస్థ ఎల్‌ అండ్‌ టి చేతులెత్తేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేసింది. దానిని దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని నివేదిక కోరిందని అంటున్నారు.

సూత్రప్రాయంగా అనుమతి లభించింది... శ్రీభరత్‌, ఎంపీ

విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అనుమతి లభించింది. 12 ఫ్లైఓవర్లు నిర్మిస్తే...మెట్రో కోసం 30 మీటర్ల వెడల్పున జాతీయ రహదారిని విస్తరించడం కష్టం అవుతుంది. అందుకని ఫ్లైఓవర్లకు బదులుగా మెట్రోను ప్రభుత్వం ఖరారు చేసింది. ఫ్లైఓవర్లు నిర్మించినా, మెట్రో నిర్మించినా రోడ్లపై కేవలం 9 శాతం మాత్రమే ట్రాఫిక్‌ తగ్గుతుందని మేము నిర్వహించిన ఫీజుబులిటీ స్టడీలో తేలింది. భోగాపురం విమానాశ్రయానికి విశాఖ నుంచి గంట నుంచి గంటన్నరలో చేరుకునేలా వీఎంఆర్‌డీఏ ద్వారా ఏడు రహదారులను నిర్మిస్తున్నాం. అవి పూర్తయితే విమానాశ్రయం వెళ్లేవారికి ఇబ్బందులు ఉండవు. ఇక సిటీలో కూడా బీచ్‌రోడ్డును కనెక్ట్‌ చేస్తూ జాతీయ రహదారిపై ప్రతి రెండు కి.మీ. ఒక మార్గం ఉంది. వాటిని కూడా విస్తరిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు.

Updated Date - Jan 03 , 2026 | 12:29 AM