తుఫాన్ ముప్పు లేనట్టే!
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:12 AM
జిల్లా రైతులకు తుఫాన్ ముప్పు తప్పిందా? బంగాళాఖాతంలో గురువారం తుఫాన్ గమనాన్ని పరిశీలిస్తే.. అవునని చెప్పక తప్పదు. వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ల ప్రకారం తుఫాన్ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం వుంది.
నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం
అయినా వరి రైతుల్లో తొలగని ఆందోళన
అనకాపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులకు తుఫాన్ ముప్పు తప్పిందా? బంగాళాఖాతంలో గురువారం తుఫాన్ గమనాన్ని పరిశీలిస్తే.. అవునని చెప్పక తప్పదు. వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ల ప్రకారం తుఫాన్ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం వుంది. దీంతో జిల్లాలో ప్రభావం అంతగా వుండదని, శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. కాగా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా వుంది. జిల్లాకు తుఫాన్ ముప్పు తొలగినప్పటికీ అక్కడక్కడా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం వుండడంతో అధికారులు అప్రమత్తంగానే వున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలతో సముద్ర తీర ప్రాంత మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. చేపట్టారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం (08924-222888, 08924-225999), అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం (9014578858) నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం (08932-224420), అడ్డరోడ్డు అర్డీఓ కార్యాలయం (08931-293606)లో కంట్రోల్ రూమ్లను మరో 48 గంటల పాటు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
వరి రైతుల ఆందోళన
రావికమతం నవంబరు19 (ఆంధ్రజ్యోతి): బంగాళఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి నుంచి మోస్తరుగా గాలులు వీస్తున్నాయి. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. జిల్లాకు తుఫాన్ ముప్పు అనుకున్నంతగా లేనప్పటికీ.. భారీ వర్షాలు కురిసే అవకావం వుందన్న సమాచారంలో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరి పైరు కోతకు వచ్చి వుండడంతో, కొద్దిపాటి గాలులు వీచినా నేల వాలుతుందని, ఈ క్రమంలో వర్షాలు కురిస్తే పంట నీట మునిగి ధాన్యం రంగు మారడమే కాకుండా మొలకెత్తే ప్రమాదం వుందని భయపడుతున్నారు.