నో స్టాక్... నో బోర్డు!
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:50 AM
జిల్లాలో ప్రస్తుతం ఇంధన కొరత ఉందా? లేదా? అన్నదానిపై స్పష్టత కొరవడింది. బంకుల్లో డీజిల్, పెట్రోల్ అందుబాటులో వున్నట్టు అధికారులు చెబుతుండగా.. పలు బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై కొరవడిన స్పష్టత
పాడేరులో సగం బంకులు మూత
అధికారుల ఒత్తిడితో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టని యజమానులు
అయోమయంలో వాహనదారులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రస్తుతం ఇంధన కొరత ఉందా? లేదా? అన్నదానిపై స్పష్టత కొరవడింది. బంకుల్లో డీజిల్, పెట్రోల్ అందుబాటులో వున్నట్టు అధికారులు చెబుతుండగా.. పలు బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రం పాడేరులో మొత్తం ఆరు బంకులు ఉండగా మంగళవారం సగం బంకుల్లో డీజిల్, పెట్రోల్ లేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జిల్లాలో పెట్రోలు, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ లేనప్పటికీ, కొరత మాత్రం కొనసాగుతున్నది. అయితే ‘నో స్టాక్ బోర్డులు’ ఉండకూడదన్న అధికారులు ఆదేశాలతో బంకుల యజమానులు బోర్డులను ఏర్పాటు చేయకుండా, ఆయిల్ కోసం లోపలికి వాహనాలు రాకుండా (స్టాక్ లేదని తెలిసేలా) ప్రవేశ మార్గానికి అడ్డంగా తాళ్లను కడుతున్నారు. దీంతో తాళ్లను చూసి బంకులో డీజిల్, పెట్రోల్ లేవని అర్థం చేసుకుని వాహనదారులు తిరుగుముఖం పడుతున్నారు. పాడేరులోని ఆరు బంకుల్లో సగం బంకుల్లో మాత్రమే పెట్రోల్, డిజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఏ బంకులో ఎప్పుడు డిజిల్/ పెట్రోల్ వుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయిల్ కోసం వాహనదారులు పలు బంకులకు వెళ్లాల్సి వస్తున్నది. విశాఖపట్నంలో ఆయిల్ కంపెనీల వద్ద వున్న నిల్వల ఆధారంగానే అల్లూరి జిల్లాలోని బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా అవుతుంటాయని, తాము పెట్టిన ఇండెంట్ ప్రకారం ఆయిల్ సరఫరా చేయరని బంకుల యజమానులు అంటున్నారు.