Share News

నో ప్లానింగ్‌!

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:51 AM

జీవీఎంసీలో అత్యంత కీలకమైన టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఇన్‌చార్జిలు రాజ్యమేలుతున్నారు.

నో ప్లానింగ్‌!

  • టౌన్‌ప్లానింగ్‌లో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఏసీపీ వరకు పలు పోస్టులు ఖాళీ

  • భర్తీపై దృష్టిసారించని జీవీఎంసీ కమిషనర్‌

  • ఒక్కొక్కరికి రెండు, మూడు జోన్‌ల బాధ్యతలు అప్పగింత

  • ఇదే అదనుగా దండుకునే పనిలో కొందరు

  • పనిఒత్తిడితో మరికొందరు సతమతం

  • కొండలా పేరుకుపోతున్న పెండింగ్‌ ఫైళ్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీలో అత్యంత కీలకమైన టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఇన్‌చార్జిలు రాజ్యమేలుతున్నారు. బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ (టీపీబీఓ) నుంచి అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ (ఏసీపీ) స్థాయి వరకు పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడడంతో ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు జోన్‌ల బాధ్యతలు చూస్తుండడంతో పనులు కదలడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని కొందరు భారంగా పరిగణిస్తుండగా, మరికొందరు దండుకునే మార్గంగా ఎంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జీవీఎంసీ పరిధిలో గతంలో ఎనిమిది జోన్‌లు ఉండగా, గత నెలలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణతో పదికి పెరిగింది. నగరంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు జారీచేయడం, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చూడడం, విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల తొలగింపు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించడం, మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల నిర్మాణానికి స్థలం సేకరించడం, రోడ్ల నిర్మాణంలో ఆస్తులు పోగొట్టుకున్న ప్రైవేటు వ్యక్తులకు టీడీఆర్‌ల జారీ, రోడ్ల విస్తరణకు మార్కింగ్‌, అడ్వర్టైజ్‌మెంట్‌ పన్నుల వసూలు, బీపీఎస్‌, ఎల్‌ఎఆర్‌ఎస్‌కు సంబంధించిన ఫైళ్లను పరిష్కరించడం, జీవీఎంసీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడం వంటి బాధ్యతలను టౌన్‌ప్లానింగ్‌ విభాగం పర్యవేక్షించాల్సి ఉంటుంది. చీఫ్‌ సిటీ ప్లానర్‌ విభాగాధిపతిగా ఇద్దరు సిటీ ప్లానర్లు, నలుగురు డీసీపీల సహకారంతో టౌన్‌ప్లానింగ్‌ విభాగం కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. ఇందుకోసం ప్రతి జోన్‌కు ఒక అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ (ఏసీపీ), టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ (టీపీఓ), ఇద్దరు టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు (టీపీఎస్‌), ముగ్గురు టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు (టీపీఓ) విధులు నిర్వర్తించేవారు. అయితే చాలామంది ఉద్యోగ విరమణ చేయడం, కొత్తగా భర్తీ చేపట్టకపోవడంతో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం పది జోన్లు ఉండడంతో మరింతమంది అధికారులు, ఉద్యోగుల అవసరం ఏర్పడింది.

ఇన్‌చార్జిలే దిక్కు...

భీమిలి జోన్‌లో ఏసీపీ, టీపీఓ మాత్రమే ఉండగా మిగిలిన పోస్టులన్నీ ఖాళీ. దీంతో ఈ బాధ్యతలను వారే చూసుకుంటున్నారు. అత్యంత కీలకమైన మధురవాడ జోన్‌లో ఏసీపీ ఒక్కరే ఉండగా, టీపీఓ, టీపీఎస్‌, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. దీంతో భీమిలి టీపీఓకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మంగళవారం నుంచి ఏసీపీ కూడా మెడికల్‌ లీవ్‌లో వెళ్లిపోవడంతో మధురవాడ జోన్‌ మొత్తం ఖాళీ కానున్నది. ఈస్ట్‌ జోన్‌లో ఏసీపీ లేకపోవడంతో డీసీపీకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. నార్త్‌ జోన్‌లో టీపీఎస్‌ పోస్టు ఖాళీగా ఉండడంతో టీపీఓకే బాధ్యతలు అప్పగించారు. నార్త్‌జోన్‌ టీపీఓకి రెండు జోన్‌ల ఇన్‌చార్జి టీపీఓ బాధ్యతలు అప్పగించడంతో ఒక్కరే మూడు జోన్‌ల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన పెందుర్తి, అగనంపూడి జోన్‌లకు సిబ్బందే లేకపోవడంతో పక్కజోన్‌ల అధికారులు, సిబ్బందికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. గాజువాక జోన్‌లో ఏసీపీ ఒక్కరే ఉండడంతో వేపగుంట జోన్‌ సిబ్బందికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అనకాపల్లిజోన్‌కు టీపీఓ ఒక్కరే ఉండగా, మిగిలిన పోస్టులను ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు.

పని ఒత్తిడితో సతమతం

ఒక్కొక్కరు రెండు, మూడు జోన్‌ల బాధ్యతలను చూస్తుండడంతో ఆయా జోన్‌లకు సంబంధించి జిల్లా కోర్టు, హైకోర్టుల్లో కేసులకు కూడా వారే హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల జోన్‌లకు సంబంధించిన రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతోందని జనం గగ్గోలు పెడుతున్నారు. మరికొందరు మాత్రం బయటకు ఈ బాధ్యతలు మోయలేని భారమని చెబుతున్నా...అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రత్యేక అవకాశంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్‌, సీసీపీ స్పందించి, టౌన్‌ప్లానింగ్‌లో అధికారులు, సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఈ విభాగంలోని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:51 AM