Share News

అమ్మానాన్న లేరు.. తల్లికి వందనం రాలేదు!

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:51 AM

వారిద్దరూ అన్నాచెల్లెళ్లు. అన్న ఇంటర్‌ మొదటి సంవత్సరం, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందన పథకానికి ఇద్దరూ అర్హులే. కానీ వీరికి తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో ప్రభుత్వం మంజూరు చేసే నగదు సాయం అందడంలేదు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

అమ్మానాన్న లేరు.. తల్లికి వందనం రాలేదు!

ప్రభుత్వ సాయానికి నోచుకోని అన్నాచెల్లెలు

బుచ్చెయ్యపేట, జూలై 28 (ఆంధ్ర జ్యోతి): వారిద్దరూ అన్నాచెల్లెళ్లు. అన్న ఇంటర్‌ మొదటి సంవత్సరం, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందన పథకానికి ఇద్దరూ అర్హులే. కానీ వీరికి తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో ప్రభుత్వం మంజూరు చేసే నగదు సాయం అందడంలేదు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

బుచ్చెయ్యపేట మండలంలోని పీపీ అగ్రహారం గ్రామానికి చెందిన పల్లా భీమరాజు, శివలక్ష్మి దంపతులు. వీరికి కుమారుడు తరుణ్‌, కుమార్తె అనురాధ వున్నాయి. దురదృష్టవశాత్తూ భీమరాజు, శివలక్ష్మి కిడ్నీ సంబంధ వ్యాధిబారిన పడి సుమారు మూడేళ్ల కిత్రం మృతిచెందారు. వీరి పిల్లలిద్దరూ అప్పటి నుంచి పెదపూడి గ్రామంలో అమ్మమ్మ సింగంపల్లి చిలుకమ్మ, తాత దేవుడు వద్ద వుంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రస్తుతం తరుణ్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చోడవరంలో చదువుతూ అక్కడే బీసీ బాలుర వసతిగృహంలో వుంటున్నాడు. అమ్మాయి అనురాధ సీతయ్యపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. ఇటీవల ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కానీ తరుణ్‌, అనురాధలకు నగదు సాయం అందే పరిస్థితి లేకపోయింది. తల్లిదండ్రులు భీమరాజు, శివలక్ష్మి మూడేళ్ల క్రితం చనిపోవడంతో పౌరసరఫరాల అధికారులు కుటుంబ రేషన్‌ కార్డులో వీరి పేర్లను తొలగించి, పిల్లల ఇద్దరి పేర్లు మాత్రమే వుంచారు. వీరిద్దరూ అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో పెరుగుతుండడం, ఇంటి పేర్లు వేరు కావడంతో తల్లికి వందనం పథకం అర్హుల జాబితాలో వీరి పేర్లు లేవు. దీంతో ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. గత ఏడాది కూడా తమకు తల్లికి వందన పథకం కింద నగదు సాయం అందలేదని తరుణ్‌, అనురాధ వాపోయారు. దీనిపై సంబంధిత సచివాలయం సిబ్బందిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ఎన్‌పీసీఐ లింక్‌ కాకపోవడం లేదా హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ కాకపోవడం వల్ల అర్హుల జాబితాలో పేర్లు లేకపోయి వుండవచ్చని చెప్పారు. తాత, అమ్మమ్మల సంరక్షణలో వున్నట్టు (గార్డియన్లుగా) తగిన ఆధారాలతో వచ్చే నెల 10వ తేదీలోగా గ్రీవెన్స్‌లో అర్జీ అందజేస్తే, రెండో విడతలో తల్లికి వందన సాయం అందుతుందని వివరించారు.

Updated Date - Jul 29 , 2026 | 12:51 AM