Share News

విద్యుత్‌ కష్టాలు ఉండవిక!

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:51 PM

నర్సీపట్నం, చోడవరం ప్రాంతాలకు ప్రయోజం చేకూర్చే 220 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు.

విద్యుత్‌ కష్టాలు ఉండవిక!
బలిఘట్టంలోని 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌

220 కేవీ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుతో తీరనున్న వెతలు

రూ. 67.35 కోట్లు మంజూరు

పనులు ప్రారంభం

నర్సీపట్నం, చోడవరం ప్రాంతాలకు ప్రయోజనం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం, చోడవరం ప్రాంతాలకు ప్రయోజం చేకూర్చే 220 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ప్రస్తుతం భూమి చదును పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో 220 ఉప కేంద్రం అందుబాటులోకి వస్తే నర్సీపట్నంలో విద్యుత్‌ వెతలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దీనికి తోడు చోడవరం ప్రాంతానికి కూడా మేలు జరుగుతుంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 220 కేవీ సబ్‌ స్టేషన్‌ మంజూరు చేసింది. బలిఘట్టం 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఉప కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం రూ.67.35 కోట్లు మంజూరు చేసింది.

నర్సీపట్నంలో లోఓల్టేజీ సమస్యకు పరిష్కారం

220 కేవీ విద్యత్‌ సబ్‌ స్టేషన్‌ అందుబాటులోకి వస్తే నర్సీపట్నం ఏరియాలో లోఓల్టేజీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈదురు గాలులతో వర్షాలు పడినప్పుడు కొరుప్రోలులైన్‌లో తరచూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి నర్సీపట్నంలో గంటల తరబడి విద్యుత్‌ లేని పరిస్థితి ఇకపై ఉండదు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. బలిఘట్టంలోని 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ పక్కనే 220 కేవీ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసి అందులో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లు, 60 ఎంవీఏ కెపాసిటీ కలిగిన ఒక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు.

నర్సీపట్నం, చోడవరం ప్రాంతాలకు ప్రయోజనం

పరవాడ ఎన్టీపీసీ నుంచి కొరుప్రోలు 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌కి, కొరుప్రోలు ఫీడర్‌ నుంచి నర్సీపట్నం 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌కి విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. ఈదురు గాలులతో వర్షాలు పడినప్పుడు కొరుప్రోలు లైన్‌లో ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా నర్సీపట్నంలో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచి పోతుంది. నర్సీపట్నం 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ పరిధిలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు మూడు ఉన్నాయి. నిరంతర విద్యుత్‌ సరఫరా మూడు సబ్‌ స్టేషన్లకు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. 220 కేవీ సబ్‌ స్టేషన్‌ అందుబాటులోకి వస్తే విద్యుత్‌ వెతలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. 220 కేవీ ఎగువ సీలేరు విద్యుత్‌ ఉప కేంద్రం, పెందుర్తి 220 కేవీవిద్యుత్‌ ఉప కేంద్రం నుంచి నర్సీపట్నం 220 కేవీ సబ్‌ స్టేషన్‌కి లైన్‌ కలుపుతారు. అవసరమైతే ఉపయోగించుకోవడానికి ప్రత్యామ్నాయంగా కొరుప్రోలు ఫీడర్‌ను కూడా ఉంచుతారు. దీని వలన నర్సీపట్నంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. అదే విధంగా చోడవరం 132/11 కేవీ సబ్‌ స్టేషన్‌కి కశింకోట ఫీడర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. దీనికి అదనంగా నర్సీపట్నం 220 విద్యుత్‌ ఉప కేంద్రం నుంచి కూడా ఒక లైన్‌ కలుపుతారు. చోడవరం ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచినప్పుడు కశింకోట లైన్‌లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కశింకోట లైన్‌లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా నర్సీపట్నం 220 విద్యుత్‌ లైన్‌ ఉపయోగపడుతుంది.

డివిజన్‌లో విద్యుత్‌ కనెక్షన్లు ఇవీ..

నర్సీపట్నం డివిజన్‌లో గృహ వినియోగదారులు 2,31,924 మంది ఉన్నారు. కమర్షియల్‌ విద్యుత్‌ కనెక్షన్లు 25,535, పరిశ్రమలకు 950, ప్రభుత్వ కనెక్షన్లు 6,729, వ్యవసాయ కనెక్షన్లు 23,619, హెచ్‌టీ కనెక్షన్లు 38.. మొత్తం 2,88,795 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు నర్సీపట్నంలో సరాసరి 47 మెగా వాట్స్‌, చోడవరంలో 25 మెగా వాట్స్‌ విద్యుత్‌ వినియోగం అవుతుంది.

Updated Date - Apr 25 , 2026 | 11:51 PM