కేజీహెచ్‌లో మందులు నిల్!
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:48 AM
పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉంది.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించాల్సిన మందులకు కొరత
గుండె, కిడ్నీ, బ్రెయిన్, తదితర సమస్యలకు వాడాల్సిన మందులు కూడా లేవంటున్న సిబ్బంది
బయట కొనుగోలు చేసుకుంటున్న రోగుల బంధువులు
ఉన్నతాధికారులకు ఇండెంట్ పెట్టినా ప్రయోజనం శూన్యం
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉంది. గడిచిన కొద్దిరోజులుగా లైఫ్ సేవింగ్, ఎమర్జన్సీ డ్రగ్స్ కొన్ని అందుబాటులో లేకపోవడంతో రోగులు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ఉన్నతాధికారులకు ఆయా విభాగాల్లో సేవలు అందించే నర్సింగ్ సిబ్బంది ఇండెంట్ పెడుతున్నా పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు.
ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరే వారికి కొన్ని రకాల మందులు అవసరమవుతుంటాయి. ముఖ్యంగా మూడు కేటగిరీల (లైఫ్ సేవింగ్, ఎమర్జన్సీ, అసెన్షియల్)కు చెందిన మందులను స్టోర్‌లో నిరంతరం అందుబాటులో ఉండేలా చూసుకుంటారు. ఈ మందులకు సంబంధించిన స్టాక్ చెక్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వారం ముందే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాల్సి ఉంటుంది. కొన్నిరకాల మందులను బఫర్‌గా కూడా పెట్టుకోవాలి. కానీ, కొద్దిరోజులుగా ఈ మూడు కేటగిరీలకు చెందిన మందులు తగ్గుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ మూడు కేటగిరీలకు చెందిన మందులు అసలు లేకపోవడంతో ఇన్‌పేషెంట్లుగా చేరినవారు ఇబ్బందిపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా విభాగాల వైద్య సిబ్బంది బయట నుంచి కొన్ని తెచ్చుకోవాలంటూ రోగుల బంధువులకు సూచిస్తున్నారు.
వేధిస్తున్న ఈ మందుల కొరత
కేజీహెచ్‌లో కొరత ఉన్న మందుల్లో అత్యంత కీలకమైనవి ఉన్నాయి. తీవ్రమైన రక్తపోటు, సెప్టిక్ షాక్‌తో వచ్చే రోగులకు, శస్త్రచికిత్స సమయంలో రోగి రక్తపోటును నియంత్రించేందుకు వినియోగించే నార్ ఎడ్రినాలిన్, గుండెల్లో మంటను తగ్గించడానికి, రక్తంలో ఆమ్లత్వం ప్రమాదకర స్థాయికి పెరిగినప్పుడు, కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు అందించే సోడా బైకార్బ్, గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు, ప్రాణాపాయ స్థితి కలిగించేలా గుండె లయ ఉన్నప్పుడు...సాధారణ స్థితికి తెచ్చేందుకు ఇచ్చే అమియోడారోన్, తీవ్రమైన అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ వాపు తీవ్రత పెరిగినప్పుడు, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే రోగులకు, మెదడు, వెన్నుపాము చుట్టు వాపు ఉన్న వారికి, చర్మ సంబంధిత వాపు, అలర్జీ, కిడ్నీ సమస్యలు, అవయవ మార్పిడి తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు ఇచ్చే మిథైల్ ప్రెడ్నిసోలోన్ వంటి మందులు ప్రస్తుతం ఆస్పత్రిలో లేవు. అలాగే, కడుపులో అధిక ఆమ్లత్వాన్ని తగ్గించేందుకు, గుండెల్లో మంట, కడుపు పొర వాపు, డ్యూనల్ అల్సర్లు తగ్గించడానికి ఇచ్చే రాంటాక్ ఇంజెక్షన్లు, అధిక రక్తపోటు నియంత్రణకు, ఛాతీ నొప్పి నియంత్రణకు, గుండె వేగాన్ని అదుపు చేయడానికి, గుండెపోటు వచ్చిన తరువాత ఒత్తిడిని తగ్గించేందుకు ఇచ్చే అటెన్‌లాల్‌తోపాటు మరికొన్ని రకాల డ్రగ్స్ కూడా లేవు. సాధారణంగా ఈ తరహా మందులను ముందుగా తెప్పించుకుని అందుబాటులో ఉంచాలి. కానీ, మందులు అడుగంటేంత వరకు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వెంటనే అధికారులు దీనిపై దృష్టి సారించాలని, లేదంటే రోగుల ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదముందని చెబుతున్నారు.