నెట్ లేదా, ...అయితే వై-ఫైకి కనెక్ట్ కండి
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:30 AM
నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. పెండింగ్ ట్రాఫిక్ ఈ-చలాన్‌లను కట్టించేందుకు వాహన చోదకులను బలవంతం చేస్తున్నారు. తమ మొబైల్ ఇంటర్‌నెట్ పనిచేయడం లేదని, తర్వాత కడతానని ఎవరైనా చెబితే...‘ఏం ఇబ్బంది లేదు.
పెండింగ్ ఈ-చలాన్‌లు కట్టించడానికి
ట్రాఫిక్ పోలీసుల ఫీట్లు
ఫోన్‌లో డేటాకు భద్రత ఉండదేమోనని వాహనచోదకుల ఆందోళన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. పెండింగ్ ట్రాఫిక్ ఈ-చలాన్‌లను కట్టించేందుకు వాహన చోదకులను బలవంతం చేస్తున్నారు. తమ మొబైల్ ఇంటర్‌నెట్ పనిచేయడం లేదని, తర్వాత కడతానని ఎవరైనా చెబితే...‘ఏం ఇబ్బంది లేదు. మీకు ఒక వైఫై కనెక్ట్ చేస్తాం. దాని ద్వారా ఫోన్‌పేలోకి లాగిన్ అయి పెండింగ్ చలాన్‌లు చెల్లించండి’ అంటూ పక్కనే ఉన్న దుకాణాల వైఫైకు వాహన చోదకుల సెల్‌ఫోన్‌లను కనెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల తమ సెల్‌ఫోన్‌లో డేటా లీకవుతుందేమోనని వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు.
నగరంలో ఇప్పుడు ఎక్కడచూసినా రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయాన్ని పూర్తిగా విస్మరించి వచ్చిపోయే వాహనాలను ఆపడం, వాటిపై పెండింగ్ ఈ-చలాన్‌లు ఎన్ని ఉన్నాయో తనిఖీ చేయడం, ఒకవేళ ఉంటే వాటిని కట్టించడం చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నాసరే పోలీసులు వెనక్కి తగ్గడం లేదు.
ఇదిలావుంటే ట్రాఫిక్ చలాన్‌లు పెండింగ్ ఉన్నట్టు గుర్తిస్తే వాటిని వాహన చోదకుడు తన ఫోన్‌పే అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్‌లు కనిపించగానే వారి సెల్‌ఫోన్ తీయాల్సిందిగా చెప్పి, ఫోన్‌పేను ఓపెన్ చేయిస్తున్నారు. ఒకవేళ ఇంటర్‌నెట్ సరిగా లేకపోతే చలాన్‌లు కట్టడానికి వీలుపడదు. దీంతో ప్రత్యామ్నాయంగా తాము స్పెషల్‌డ్రైవ్ చేస్తున్న ప్రాంతంలోని ఏదో ఒక దుకాణం/సంస్థకు చెందిన వైఫై యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను పోలీసులు తీసుకుంటున్నారు. సెల్‌ఫోన్ డేటా కనెక్ట్ అవని వారికి ఆ వైఫై పాస్‌వర్డ్ చెప్పి లాగిన్ చేయిస్తున్నారు. ఫోన్‌పే ద్వారా పెండింగ్ చలాన్‌లను కట్టిస్తున్నారు. దీనిపై వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్‌లోని డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడుతున్నారు.