Share News

ఎమ్మెల్యే పర్యటనపై సమాచారం ఇవ్వడంలేదు

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:17 AM

సంబంధించి టీడీపీ శ్రేణులకు ఎటువంటి సమాచారం వుండడంతో లేదని, దీనివల్ల గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాలేని పరిస్థితిని కేడర్‌ ఎదుర్కొంటున్నదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత పప్పల చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే పర్యటనపై సమాచారం ఇవ్వడంలేదు
దొడ్డి శ్రీనివాసరావును టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని పప్పల చలపతిరావు, బొండా జగన్నాథంలకు వినతిపత్రం అందిస్తున్న గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భీమరశెట్టి శ్రీనివాసరావు, తదితరులు

గ్రామాల్లో ఇబ్బంది పడుతున్న టీడీపీ శ్రేణులు

సీనియర్‌ నేత పప్పల చలపతిరావు ఆవేదన

టీడీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాల్సిందేనని విస్పష్టం

‘మునగపాక’ మాజీ అధ్యక్షుడిని సస్పెండ్‌ చేయాలని ప్రజాదర్బార్‌లో పలువురు ఫిర్యాదు

మునగపాక, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పర్యటనలకు సంబంధించి టీడీపీ శ్రేణులకు ఎటువంటి సమాచారం వుండడంతో లేదని, దీనివల్ల గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాలేని పరిస్థితిని కేడర్‌ ఎదుర్కొంటున్నదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత పప్పల చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఇక్కడ టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో తొలుత పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో వుంటూ, మరో పార్టీని భుజాన వేసుకొని మోస్తున్న వారిపై అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పప్పల చలపతిరావుతోపాటు పార్టీ నియోజకవర్గం పరిశీలకుడు బొండా జగన్నాథంలను కోరారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ, కార్యకర్తల ఆవేదనను ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ప్రస్తావించినట్టు చెప్పారు. టీడీపీలో కొంతమంది కోవర్టులు ఉన్నారని, సమావేశాల్లో మనం మాట్లాడిన మాటాలను మొబైల్‌ ఫోన్ల ద్వారా లైవ్‌లో చేరవేస్తున్నారని, ఇటువంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భీమరశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత సాధారణ ఎన్నికల ముందు టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి శ్రీనివాసరావు నేతల మధ్య విభేదాలు సృష్టించి పార్టీకి నష్టం కలిగించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీలో చేరడానికి ముందుకు వచ్చిన ప్రతిపక్ష వైసీపీ వారిని కూటమిలోని మరో పార్టీలోకి పంపారని, అందువల్ల శ్రీనివాసరావును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పప్పల చలపతిరావుకు వినతిపత్రం అందించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ లాలం భవాని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్‌, శ్రీకాళహస్తి ఆలయ బోర్డు డైరెక్టర్‌ బీలా స్రవంతి, మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డొక్కా నాగభూషణం, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 01:18 AM