Share News

పెట్రోల్‌ బంకులపై ‘నో క్రెడిట్‌’ ఎఫెక్ట్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:01 AM

మండలంలోని కొన్ని పెట్రోలు బంకులకు ఇంధన కంపెనీల నుంచి పెట్రోలు, డీజిల్‌ సరఫరాలో తీవ్ర జాప్యం కారణంగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా బంకుల్లో అమ్మకాలను ఆపేశారు. మండలంలో చోడవరం, నరసాపురం, వెంకన్నపాలెం, గవరవరం ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది బంకులు వున్నాయి.

పెట్రోల్‌ బంకులపై ‘నో క్రెడిట్‌’ ఎఫెక్ట్‌
చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో స్టాక్‌ లేని పెట్రోల్‌ బంకు

బకాయిలు చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామంటున్న కంపెనీలు

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో నిబంధన

తలలు పట్టుకుంటున్న బంకుల నిర్వాహకులు

తాత్కాలికంగా ఆగిన పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు

చోడవరం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొన్ని పెట్రోలు బంకులకు ఇంధన కంపెనీల నుంచి పెట్రోలు, డీజిల్‌ సరఫరాలో తీవ్ర జాప్యం కారణంగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా బంకుల్లో అమ్మకాలను ఆపేశారు. మండలంలో చోడవరం, నరసాపురం, వెంకన్నపాలెం, గవరవరం ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది బంకులు వున్నాయి. వీటిలో నాలుగు బంకులు ఒక్క చోడవరం పట్టణంలోనే వున్నాయి. చోడవరంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న భారత్‌ పెట్రోలియం బంకు, పాత బస్టాండ్‌ వద్ద ఇండియన్‌ ఆయిల్‌ బంకుల్లో మాత్రమే నిల్వలు ఉన్నాయి. వివిధ కారణాల వల్ల మిగిలిన ఆరు బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు జరగడంలేదు. మండలం మొత్తానికి రెండు బంకుల్లోనే ఇంధన నిల్వలు వుండడంతో వీటి వద్ద వద్ద వాహనదారులు బారులు తీరికనిపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు గతంలో రూ.100 లేదా రూ.200 మాత్రమే ఆయిల్‌ పోయించేవారు. కానీ ఇప్పుడు పెట్రోల్‌/ డీజిల్‌ కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో ఏకంగా ట్యాంకు ఫుల్‌ చేయిస్తున్నారు. దీనివల్ల బంకుల్లో ఆయిల్‌ స్టాక్‌ త్వరగా తగ్గిపోతున్నది. కాగా ‘కలగర్ల ఫిల్లింగ్‌ స్టేషన్‌’ యజమాని కలగర్ల శేషును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఇంధన కంపెనీలు ‘అరువు’ (క్రెడిట్‌)పై బంకులకు ఆయిల్‌ సరఫరా చేస్తుంటాయని, అయితే మార్చి నెల చివరి వారంలో పెండింగ్‌ బకాయిలను క్లియర్‌ చేస్తేనే పెట్రోల్‌/ డీజిల్‌ ట్యాంకర్లను పంపుతాయని చెప్పారు. ఏటా మార్చి నెల చివరి వారంలో ఈ పరిస్థితి వుంటుందని, అంతే తప్ప పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో సంబంధం లేదని, పెట్రోల్‌ కొరత లేదని చెప్పారు.

Updated Date - Mar 27 , 2026 | 01:01 AM