కాలుష్య నియంత్రణలో రాజీ లేదు
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:26 AM
నగరంలో కాలుష్య నియంత్రణపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల ప్రాణాల కంటే ఇంకేమీ ఎక్కువ కాదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య స్పష్టంచేశారు.
ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు
కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య
ఇంకెన్ని రోజులు ఈ డ్రామా అంటూ పోర్టు, పారిశ్రామిక సంస్థలపై ఆగ్రహం
బొగ్గు, ఇతర ముడి సరకుపై టార్పాలిన్లు కప్పడం లేదంటూ వీడియోలు, ఫొటోలు ప్రదర్శన
నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు
ఎంపీ ఎం.శ్రీభరత్
ధూళితో చాకలిగెడ్డ వాసుల ఇబ్బందులు: ఎమ్మెల్యే గణబాబు
కాలుష్యం తగ్గేంత వరకూ పోర్టుల్లో కార్యకలాపాలు నిలిపివేయండి: విష్ణుకుమార్‌రాజు
ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలి: పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కాలుష్య నియంత్రణపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల ప్రాణాల కంటే ఇంకేమీ ఎక్కువ కాదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రజలు, ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు మోసం చేస్తారంటూ పోర్టు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులపై ఆయన మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యమేనని, దాంతోపాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామన్నారు.
కాలుష్యంపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పి.కృష్ణయ్య మాట్లాడుతూ సీఎస్సార్ నిధులు ఇస్తున్నామని చెబుతున్న సంస్థలు, పోర్టులో టార్పాలిన్లు లేకుండా గుట్టలు గుట్టలుగా బొగ్గు, ఇతర ముడి ఖనిజాలను నిల్వ చేస్తున్నాయని పేర్కొంటూ వాటికి సంబంధించి తమ సంస్థ డ్రోన్‌తో తీసిన వీడియోలు, ఫొటోలను చూపించారు. విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో టార్పాలిన్లు లేకుండా ముడిసరుకు నిల్వ, రవాణా చేయడాన్ని నిషేధించాలన్నారు. రెండు నెలల్లో పురోగతి కనిపించకపోతే సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంగవరం పోర్టు చుట్టూ 20 అడుగుల గోడ నిర్మించాలని, మొక్కలు విరివిగా నాటాలని ఆదేశించారు. అదేవిధంగా హిందూజా, జిందాల్, ఫార్మా కంపెనీలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ కంపెనీలు ఆర్జించే లాభాల కంటే ప్రజల ప్రాణాలు, వారి జీవన ప్రమాణాలే అత్యంత విలువైనవన్నారు. కాలుష్య నియంత్రణకు సమగ్ర కార్యాచరణ తయారుచేయాలన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు అమలు చేయని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని పరిశ్రమలు మాటల్లో పర్యావరణ రక్షణ గురించి చెబుతున్నాయని, చేతల్లో విఫలమవుతున్నాయని వ్యాఖ్యానించారు. మాట ఒకటి, చేత మరొకటి వద్దని హెచ్చరించారు. గాలి నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నగరంలో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలన్నారు. అదేవిధంగా పరిశ్రమలకు చెందిన వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్న రహదారులకు ఆయా సంస్థలే బాధ్యత వహించాలన్నారు. గత ఐదేళ్లలో సీఎస్‌ఆర్ నిధుల వ్యయంపై నివేదికలు ఇవ్వాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకం కాదని పేర్కొంటూ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేశారు.
పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ కంచరపాలెం చాకలిగెడ్డ వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లకు ఆనుకుని ముడి ఇనుము యార్డుల నుంచి ధూళి ఎక్కువగా వస్తున్నదన్నారు. అక్కడ నివసించే ప్రజల కడుపులోకి అన్నంతోపాటు ధూళి కూడా వెళుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బొగ్గు, ముడి ఇనుము వంటి వాటిని కంచరపాలెం వరకు నిల్వ చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నల్లటి ఽధూళి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల ఆరోగ్యాలు కుదుటపడేంత వరకు పోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రెండు పోర్టుల నుంచి వచ్చే తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కాలుష్యంతో పోర్టు, నేవీ ఉద్యోగులు క్వార్టర్లు ఖాళీ చేస్తున్నారని పేర్కొంటూ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలన్నారు. కాలుష్యం తీవ్రతను తగ్గించడానికి భారీగా చెట్లు పెంచాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ కాలుష్యానికి గల కారణాలను ప్రతి పరిశ్రమ స్వయంగా విశ్లేషించాలన్నారు. వ్యర్థాల నిర్వహణను 100 శాతం అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి తీసుకురావద్దన్నారు. వచ్చే పదేళ్లలో విశాఖ మరింత అభివృద్ధి చెందనున్నందున పరిశ్రమలు కాలుష్య నియంత్రణ విషయంలో అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో జేసీ జి.విద్యాధరి, కాలుష్య నియంత్రణ మండలి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా సమావేశానికి ముందుగా వన్‌టౌన్‌లోని కోటవీధి వాసులు కాలుష్య తీవ్రతపై వినతులు అందజేశారు.