Share News

ఎన్‌ఐవోకు సొంత గూడు

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:13 AM

నగరంలో గల జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ) కార్యాలయానికి ఎట్టకేలకు సొంత గూడు అమిరింది.

ఎన్‌ఐవోకు సొంత గూడు

తూర్పుతీరంలో సేవలు అందించేందుకు 1976లో విశాఖపట్నం సంస్థ ప్రారంభం

ఐదు దశాబ్దాలుగా అనేక రకాలుగా సేవలు

కృష్ణా, గోదావరి బేసిన్‌లో చమురు వాయువు నిక్షేపాల అన్వేషణ, గుర్తింపు, వెలికతీతలో కీలకపాత్ర

కేంద్ర మంత్రి చేతులమీదుగా

రుషికొండలో నేడు నూతన భవనం ప్రారంభం

విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

నగరంలో గల జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ) కార్యాలయానికి ఎట్టకేలకు సొంత గూడు అమిరింది. భీమిలి బీచ్‌రోడ్డులో రుషికొండ సమీపాన రాడిసిన్‌ బ్లూ హోటల్‌కు ఎదురుగా కొండపై రూ.30 కోట్ల వ్యయంతో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన రెండంతస్థుల భవనాన్ని శుక్రవారం కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ప్రారంభించనున్నారు. ఎన్‌ఐవో ప్రధాన కార్యాలయం గోవాలో ఉండగా, తూర్పుతీరం కోసం 1976లో లేబొరేటరీని విశాఖపట్నంలో ప్రారంభించారు. తొలుత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఎన్‌ఐవో, ఆ తరువాత లాసన్స్‌బే కాలనీ, వాల్తేరుల్లో అద్దె భవనాల్లో కొనసాగింది.

తూర్పుతీరంలో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, చివరికి అంటార్కిటికాలో పలు రకాల పరిశోధనల్లో ఎన్‌ఐఓ కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. కోల్‌కత్తా నుంచి కన్యాకుమారి వరకు, అండమాన్‌ నికోబార్‌ దీవుల పరిసరాల్లో అనేక రకాల అధ్యయనాలు నిర్వహించింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లో చమురు వాయువు నిక్షేపాల అన్వేషణ, గుర్తింపు, వెలికతీతలో ఎన్‌ఐవో పాత్ర విస్మరించలేనిది. అదేవిధంగా మహానది, నాగావళి, వంశధార నదుల పరీవాహక ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణకు అనేక పరిశోధనలు చేపట్టింది. కోల్‌కత్తా నుంచి కన్యాకుమారి వరకూ పోర్టుల నిర్మాణం, ఫార్మా, రసాయన వ్యర్థాల అవుట్‌లెట్ల నిర్మాణానికి ఈ సంస్థ అనుమతులు తప్పనిసరి. బంగాళాఖాతంలో మత్స్య సంపద లభ్యత, కాలుష్యం తీవ్రత, ఖనిజ సంపదపై ఎన్‌ఐఓ అనేక పరిశోధనలు నిర్వహించింది. ప్రస్తుతం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సైంటిస్టు ఇన్‌చార్జిగా వీవీఎస్‌ఎస్‌ శర్మ, ఏడుగురు సైంటిస్టులు, ఏడుగురు సాంకేతిక నిపుణులు సేవలు అందిస్తున్నారు. ఇంకా 60 మంది పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు. కొందరు ఈ కేంద్రంలో నేరుగా ప్రవేశాలు పొందగా, మరికొందరు ఏయూలో ప్రవేశాలు తీసుకుని ఇక్కడ అధ్యయనం చేస్తారు. ఈ కేంద్రంలో అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ కోర్సు అందిస్తున్నారు. ఏడాది వ్యవధి ఉండే ఈ కోర్సులో రెండు సెమిస్టర్‌లు నిర్వహించేందుకు పది మందికే ప్రవేశాలు కల్పిస్తున్నారు.

విస్తృత పరిశోధనలకు అవకాశం

డాక్టర్‌ వీవీఎస్‌ఎస్‌ శర్మ, సైంటిస్టు ఇన్‌చార్జి, ఎన్‌ఐవో, విశాఖపట్నం.

సుదీర్ఘకాలం తరువాత సంస్థకు సొంత గూడు వచ్చింది. రెండంస్థుల భవనంలో ఓషన్‌ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ తదితర రంగాల్లో పరిశోధనలు, కొత్తకోర్సులు అందించేలా సదుపాయాలు ఉన్నాయి. ఎన్‌ఐవోకు ఉన్న రెండు నౌకల ద్వారా తూర్పుతీరంలో పలు రకాల పరిశోధనలు చేస్తున్నాం. ప్రధానంగా సముద్ర కాలుష్యం, వనరుల అన్వేషణ, ఇతరత్రా అంశాల్లో అధ్యయనాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం.

Updated Date - Jan 30 , 2026 | 01:13 AM