రాత్రి గస్తీ పటిష్టం
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:54 AM
నగరంలో చోరీలను నియంత్రించేందుకు రాత్రి గస్తీని పటిష్టం చేయాలని అధికారులను పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు.
నేర సమీక్షా సమావే శంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఆదేశం
శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సంబంధిత స్టేషన్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
నగరంలో చోరీలను నియంత్రించేందుకు రాత్రి గస్తీని పటిష్టం చేయాలని అధికారులను పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో క్రైమ్ రేటు మరింత తగ్గించేందుకు అందరూ సమష్టిగా కృషిచేయాలని కోరారు. విజిటర్స్ మానటరింగ్ సిస్టమ్ (వీఎంఎస్)ను పూర్తిగా వినియోగించుకోవడంపై అందరూ దృష్టిసారించాలని సూచించారు. స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసుల గురించి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సంబంధిత స్టేషన్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, గంజాయి విక్రయాలు/వినియోగం, ఈవ్‌టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి జరగకుండా నిరంతరం ఆకస్మిక తనిఖీలు, నిఘా పెట్టడం చేయాలని ఆదేశించారు. స్టేషన్ల వారీగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి విజిబుల్ పోలీసింగ్, పికెట్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాంచారు. సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ఫిర్యాదుదారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హె చ్చరించారు.
ఏఎంసీ పరిధిలోని ముగ్గురు వైద్యులకు పదోన్నతులు
రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా రాంబాబు
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ పి.బుజ్జిబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా పదోన్నతి పొందారు. పదోన్నతులు పొందిన వారిలో ఆంధ్ర మెడికల్ కళాశాల/కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కె.రాంబాబు రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, రేడియాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ పి.బుజ్జిబాబు పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఛాతీ అంటువ్యాధుల ఆస్పత్రి ప్రొఫెసర్, సూపరింటెండెంట్‌గా చేస్తున్న డాక్టర్ సునీల్‌కుమార్ పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. వీరికి పలువురు వైద్యులు అభినందనలు తెలియజేశారు. రెండు, మూడు రోజుల్లో వీరంతా బాధ్యతలను చేపట్టే అవకాశముంది.
బీచ్‌రోడ్డులో కాఫీ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్
జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
ఆర్‌కే బీచ్‌రోడ్డులో కాఫీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది సందర్శకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ తెలిపారు. జీసీసీ డైరెక్టర్లతో కలిసి ఆయన మంగళవారం బీచ్‌రోడ్డులో జీసీసీ నిర్మిస్తున్న కాఫీ సెంటర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ సెంటర్ నిర్మాణానికి రూ.1.06 కోట్లు వెచ్చిస్తున్నామని, జీసీసీకి చెందిన అన్ని ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కాఫీ కేఫ్, మొదటి అంతస్థులో కాఫీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో కాఫీ పంట సాగు, పండ్ల సేకరణ, వాటి ప్రాసెసింగ్ విధానం అన్నీ ప్రదర్శిస్తారన్నారు. పంట నుంచి కాఫీ కప్పులోకి ఎలా వస్తుందో అర్థమయ్యేలా తెలియజేస్తామన్నారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు బొర్రా నాగరాజు, జీవుల నాయక్, కన్నప్పరాజు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
592 పాఠశాలలకుగాను 318 పాఠశాలల్లో ఏకగ్రీవం
267 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణ, కోరం లేక ఏడుచోట్ల వాయిదా
డాబాగార్డెన్స్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ’ (ఎస్‌ఎంసీ) ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 592 పాఠశాలలకు (569 ప్రభుత్వ పాఠశాలలు, 16 ఎయిడెడ్)గాను 318 పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 267 పాఠశాలల్లో ఓటింగ్ జరపాల్సి వచ్చింది. కోరం లేకపోవడంతో ఏడు పాఠశాలల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత కొత్త కమిటీలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి, తొలి సమావేశాలను నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఎస్‌ఎంసీ ఎన్నికలను నిర్వహించినట్టు సమగ్ర శిక్ష ఏపీసీ జోగ చంద్రశేఖరరావు తెలిపారు. యాజమాన్య కమిటీలు పాఠశాల అభివృద్ధికి అంటే ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించడం, గుణాత్మక విద్యను పెంపొందించడం, పిల్లల రోజువారీ హాజరు మెరుగుపరచడం, బాలిక విద్య అభివృద్ధి, డ్రాపౌట్స్ లేకుండా చేయడం, ప్రభుత్వం సూచించిన వివిధ కార్యక్రమాల అమలుకు తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందన్నారు.
నేడు, రేపు కిరండూల్ రైళ్లు రద్దు
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు రాయగడ డివిజన్‌లో విరిగిపడిన కొండచరియల తొలగింపు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖ-కిరండూల్-విశాఖ (58501/58502) పాసింజర్లు, విశాఖ-కిరండూల్-విశాఖ (18515/18516) ఎక్స్‌ప్రెస్ రైళ్లను బుధ, గురువారాల్లో రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.