25న నూతన జడ్పీలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:07 AM
జీవీఎంసీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు సిద్ధం కావాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు.
అనకాపల్లికి 44, అల్లూరికి 19, విశాఖకు పది మంది సిబ్బంది
24వ తేదీ సాయంత్రం రిలీవ్ కావాల్సిందే
విశాఖ జిల్లాకు మరికొంతమంది అవసరమంటూ ప్రతిపాదనలు
24న పాలకవర్గ గడువు ముగియనుండడంతో 25 నుంచి ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
కొత్త జిల్లాల ప్రాతిపదికగా ఈనెల 25వ తేదీన జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం జిల్లా పరిషత్ యథావిధిగా కొనసాగుతుంది. కొత్తగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు జడ్పీలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న 73 మంది సిబ్బందిని మూడు జిల్లాలకు సర్దుబాటు చేశారు. గ్రామీణ ప్రాంత జనాభా, మండలాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అనకాపల్లి జిల్లాకు 44 మందిని, అల్లూరి సీతారామరాజుకు 19 మందిని, విశాఖకు 10 మందిని కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో మొత్తం ఎనిమిది సెక్షన్లు ఉండేవి. కానీ అనకాపల్లి జిల్లాలో ఐదు, అల్లూరి జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో ఒక సెక్షన్ ఉండనున్నాయి. దీనికి అనుగుణంగా ఎనిమిది మంది పాలనాధికారుల్లో అనకాపల్లికి ఐదుగురిని, అల్లూరికి ఇద్దరిని, విశాఖకు ఒకరిని కేటాయించారు. అలాగే అనకాపల్లి, అల్లూరి, విశాఖ జిల్లాలకు వరుసగా సీనియర్ అసిస్టెంట్లను 7, 3, 2, జూనియర్ అసిస్టెంట్లను (మొత్తం 26 మంది)ను 16,7,3, టైపిస్టులను 3,1,1, ఆఫీస్ సబార్డినేట్లను 7,3,2 చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా ఆయా జిల్లాలకు కేటాయించబడిన సిబ్బంది (విశాఖ తప్ప) 24వ తేదీ సాయంత్రం రిలీవ్ అయి 25వ తేదీ ఉదయం కొత్త జడ్పీ కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. ఇదిలావుండగా జడ్పీ సీఈవో, డిప్యూటీలు ఇక్కడే ఉంటారా? లేదా మరొక జిల్లాకు కేటాయిస్తారా?...అనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావల్సి ఉంది. ఒకవేళ ప్రస్తుత సీఈవో, డిప్యూటీ సీఈవో ఇక్కడే ఉంటే అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు కొత్తగా సీఈవో, డిప్యూటీ సీఈవోలను నియమించాల్సి ఉంది. విశాఖ జడ్పీ పరిధిలో కేవలం నాలుగు మండలాలే ఉన్నప్పటికీ నగర పరిధిలో ఎక్కువ పాఠశాలలు ఇప్పటికీ జడ్పీ యాజమాన్యం కిందనే ఉన్నాయి.
నగరంతోపాటు నాలుగు గ్రామీణ మండలాల్లో సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరి పీఎఫ్ ఖాతాలు జడ్పీ అధికారులే నిర్వహించాల్సి ఉంది. పీఎఫ్ ఖాతాల నిర్వహణకు ఒక సెక్షన్ నిర్వహించాలి. అదేవిధంగా నగరంలో జడ్పీ ఆస్తుల రక్షణకు కొంతమంది సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు ప్రస్తుతం కేటాయించిన పది మందికి అదనంగా మరికొంతమంది సిబ్బందిని మంజూరుచేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇదిలావుండగా 24వ తేదీ సాయంత్రంతో జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియనున్నందున మూడు జిల్లాల్లో జడ్పీ ప్రత్యేకాధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు.
నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
రేపటితో ముగియనున్న పాలకవర్గం గడువు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనున్నది. 2021 సెప్టెంబరు 23న ఏర్పడిన జడ్పీ పాలకవర్గ కాలపరిమితి ఈనెల 24వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో చివరి సమావేశం మంగళవారం ఏర్పాటుచేస్తున్నారు. మొత్తం 39 మంది జడ్పీటీసీ సభ్యుల్లో 37 మంది వైసీపీకి చెందినవారుకాగా, టీడీపీ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 2022 ఏప్రిల్‌లో విశాఖ జిల్లా నుంచి విడదీసి అనకాపల్లి, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలను ఏర్పాటుచేశారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా పరిషత్‌లు ఇప్పటివరకూ కొనసాగాయి.
ఇక వైసీపీ హయాంలో సభ్యులకు గౌరవ వేతనం సక్రమంగా అందలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రమం తప్పకుండా గౌరవ వేతనం విడుదల చేస్తోంది. మంగళవారం జరగనున్న చివరి సమావేశంలో వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, విద్య, గ్రామీణ నీటి సరఫరా, తదితర విభాగాలకు సంబంధించిన సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అనంతరం చైర్‌పర్సన్, జడ్పీటీసీ సభ్యులను సత్కరించనున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందుని, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని సీఈవో పి.నారాయణమూర్తి కోరారు.
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంకండి
అధికారులకు కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశం
120 వార్డుల్లో 1,955 పోలింగ్ కేంద్రాలు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు సిద్ధం కావాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు. ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా జీవీఎంసీలోని అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో 120 వార్డుల్లో 1,995 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన నోటిఫికేషన్ ప్రతులను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోనల్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాలు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చినట్టయితే వాటిని స్వీకరించడం, పరిష్కరించడం, ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలు, మిస్సింగ్‌లకు తావులేకుండా చూడడంపై అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. ఎన్నికల్ నోటిఫికేషన్ విడుదల, కోడ్ అమలు వంటి వాటిపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ ఎన్నికల కోసం 14 వేలకుపైగా సిబ్బంది అవసరం అవుతారని, ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు, జోనల్ కమిషనర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. ఎన్నికలను పారదర్శకంగా, లోపాలకు ఆస్కారం లేకుండా నిర్వహించే విషయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, మేయర్ ఎన్నికకు ప్రత్యేక అధికారిగా నియమితులైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ దయానిధి ఆధ్వర్యంలో జీవీఎంసీ సమావేశ మందిరం నుంచి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.