న్యూ ఇయర్ కిక్కు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:32 AM
కొత్త సంవత్సరం మందుబాబులు పండుగ చేసుకున్నారు. డిసెంబరు 31వ తేదీన ఏకంగా రూ.12 కోట్ల విలువైన మద్యం తాగేశారు.
ఒక్క రోజునే రూ.12 కోట్లు మద్యం విక్రయం
మామూలు రోజుల్లో రూ.5 కోట్ల నుంచి 6 కోట్ల అమ్మకాలు
విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):
కొత్త సంవత్సరం మందుబాబులు పండుగ చేసుకున్నారు. డిసెంబరు 31వ తేదీన ఏకంగా రూ.12 కోట్ల విలువైన మద్యం తాగేశారు. జిల్లాలో 159 మద్యం దుకాణాలు, 75 బార్లు, 16 స్టార్‌హోటళ్లు, ఐదు ఏపీటీడీసీ బార్‌లు, ఏడు క్లబ్‌లు, రెండు ప్రీమియం స్టోర్లలో మద్యం విక్రయిస్తున్నారు. వీటి ద్వారా ప్రతి రోజూ సుమారు రూ.ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుంది. అయితే బుధవారం ఒక్కరోజే రూ.12 కోట్లు విలువైన మద్యం అమ్ముడైనట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అందులో సుమారు 51 శాతం విక్రయాలు డిజిటల్ పేమెంట్ రూపంలోనే జరిగాయన్నారు. డిజిటల్ పేమెంట్‌లను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డిజిటల్ పేమెంట్‌లను అనుమతించకపోతే చర్యలు తీసుకుంటామని మద్యం వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. దీంతో గత ఏడాదితో పోల్చితే డిజిటల్ పేమెంట్‌లు 200 శాతం మేర పెరిగాయని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు.
డిసెంబరు 31వ తేదీ రాత్రి హోటళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తుంటాయి. ఈ ఏడాది కూడా పలు స్టార్‌హోటళ్లు, క్లబ్‌లు ప్రత్యేక ఈవెంట్‌లు నిర్వహించాయి. అందులో కస్టమర్లకు మద్యం అందుబాటులో ఉంచాయి. అలాగే మరికొందరు స్నేహితులతో కలిసి ఇళ్లలో పార్టీలు జరుపుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడైంది.
257 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 257 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఏటా డిసెంబరు 31వ రాత్రి నగరంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనలకు ఈ ఏడాది అవకాశం ఉండకుండా చేయాలనే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ బీచ్‌రోడ్డుతోపాటు బీఆర్‌టీఎస్ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ సహా 83 ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయించారు. ఆయాచోట్ల 2,721 వాహనాలను తనిఖీ చేయగా, 275 మంది మద్యంసేవించి వాహనాలను నడుపుతున్నట్టు గుర్తించడం జరిగింది. వారిపై కేసులు నమోదుచేశారు. అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్‌కు సంబంధించి 644 మందిపై కేసులు నమోదుచేశారు. అలాగే 99 మంది బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నట్టు డ్రోన్‌ల ద్వారా గుర్తించి కేసులు నమోదుచేశారు. పోలీసుల ప్రత్యేక ఫోకస్ కారణంగా ఈ ఏడాది డిసెంబరు 31న రోడ్డు ప్రమాదాల కారణంగా ఒక్క మరణం కూడా నమోదుకాలేదని సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు.