Share News

పర్యాటకానికి కొత్త హంగులు

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:25 PM

గిరిజన ప్రాంతంలో పర్యాటకానికి మరిన్ని హంగులు కల్పించి, రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.

పర్యాటకానికి కొత్త హంగులు
కారవాన్‌ పార్కుకు ఎంపికైన అరకు పైనరీ

అందుబాటులోకి రానున్న నూతన వసతులు

ఐదు ప్రాంతాల్లో కారవాన్‌ టూరిజం పార్కులు

గిరిజన పల్లెల్లో హోం స్టే, డోమ్‌హౌస్‌ సదుపాయాలు

స్థానిక చిరు ధాన్యాలతో పర్యాటకులకు ఆహార పదార్థాలు

భవిష్యత్తులో అరకులోయలో హెలీరైడ్‌కు సైతం ఏర్పాట్లు

(పాడేరు/అరకులోయ- ఆంధ్రజ్యోతి)

గిరిజన ప్రాంతంలో పర్యాటకానికి మరిన్ని హంగులు కల్పించి, రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పర్యాటకులకు ఆధునిక వసతులతో కూడిన కారవాన్‌ సదుపాయాలు, గిరిజన పల్లెల్లో బస చేసి స్థానిక చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహార రుచులను సైతం చూసే అవకాశం కల్పించేందుకు హోం స్టేలను సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో అరకులోయ కేంద్రంగా హెలీ టూరిజాన్ని సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో రానున్న రోజుల్లో మన్యంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు మరిన్ని కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చి నూతన అనుభూతిని కలిగిస్తాయని టూరిజం అధికారులు భావిస్తున్నారు.

ఉమ్మడి అల్లూరి జిల్లాలో 5 కారవాన్‌ టూరిజం పార్కులు

ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రధానమైన ఐదు పర్యాటక ప్రాంతాల్లో కారవాన్‌ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపుతున్నది. ఇందులో భాగంగా అరకులోయకు సమీపంలోని అరకు పైనరీ, ముంచంగిపుట్టు మండలంలో జోలాపుట్‌ జలాశయం, చింతపల్లి మండలం లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాల్లో కారవాన్‌ టూరిజం పార్కుల అభివృద్ధికి చర్యలు ప్రారంభించింది. ఒక్కో పార్కులో మౌలిక సదుపాయాలు, వినోద కార్యక్రమాల కోసం రూ.కోటి చొప్పున మొత్తం రూ.5 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అవి ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. అవి అందుబాటులోకి వస్తే కారవాన్‌లో సుమారుగా 15 మంది సౌకర్యవంతంగా బస చేయడంతోపాటు, సదరు పార్కులోనే రెస్టారెంట్‌, ఇతర సదుపాయాలు, వినోద కార్యక్రమాలుంటాయి. దీంతో వినూత్నంగా లగ్జరీ స్థాయిలో సదుపాయాలు కోరుకునే పర్యాటకులకు కారవాన్‌ టూరిజం పార్కులు వేదికగా మారునున్నాయని అధికారులు, పర్యాటకులు అంటున్నారు.

గిరిజన పల్లెల్లో బసకు హోం స్టే సదుపాయాలు

బడ్జెట్‌లోనే గిరిజన పల్లెల్లో బస చేస్తూ వారి ఆచార వ్యవహారాలు, జీవన శైలిని స్వయంగా ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం హోం స్టే సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వాటికి చేరువగా ఉన్న గిరిజన పల్లెల్లోని ఇళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్ది వాటినే సందర్శకులకు అద్దెలకు ఇస్తారు. అలాగే వారికి అవసరమైన ఆహారాలు, స్థానికంగా లభించే చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాలు సైతం సమకూర్చుతారు. దీంతో గిరిజన పల్లెల్లో గడిపి, వారి జీవన శైలిని స్వయంగా తిలకించిన అనుభూతిని పొందేందుకు హోం స్టే చక్కని అవకాశంగా ఉంటుందని పర్యాటకులు సైతం భావిస్తున్నారు. ఇప్పటికే అరకులోయకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చొంపి అనే గిరిజన పల్లెలో నాలుగు హోం స్టేలను అందుబాటులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల వరకు హోం స్టేలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కాగా ఆధునిక సదుపాయాలతో ఎక్కడైనా సులభంగా వసతి సదుపాయాన్ని కల్పించేందుకు డోమ్‌ హౌస్‌లు అనువుగా ఉంటాయి. దీంతో జిల్లాలో ప్రధానమైన పర్యాటక ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. దీనిపై ఇప్పటికి ఎటువంటి ప్రణాళికలు లేనప్పటికీ భవిష్యత్తులో వాటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన మాత్రం ఉంది.

భవిష్యత్తులో అందుబాటులోకి హెలీ టూరిజం

జిల్లాలో అరకులోయ కేంద్రంగా హెలీ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి అరకులోయకు హెలీరైడ్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అందుకు గాను అరకులోకు సమీపంలో ఉన్న కొత్తవలస ఉద్యానవన క్షేత్రంలో శాశ్వత హెలీప్యాడ్‌ను సైతం నిర్మించారు. భవిష్యత్తులో పర్యాటక శాఖ లేదా ప్రైవేటు సంస్థఽలు హెలీరైడ్‌ ఏర్పాటుకు అనువుగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా, వచ్చే ఏడాది నుంచి ఆ సదుపాయం పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో భవిష్యత్తులో అరకులోయకు వచ్చే పర్యాటకులకు విహంగ వీక్షణం సైతం సమకూరనుంది.

Updated Date - Feb 04 , 2026 | 11:25 PM