Share News

కైలాసగిరికి కొత్త రోప్‌వే

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:54 AM

కైలాసగిరికి కొత్త రోప్‌వే నిర్మాణానికి ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి.

కైలాసగిరికి కొత్త రోప్‌వే

ఏడాది తరువాత టెండర్లు ఖరారు

ప్రస్తుత కాంట్రాక్టర్‌కే అప్పగింత

తెలుగు మ్యూజియం వరకూ...

సింగపూర్‌ తరహాలో లూజ్‌ గ్రావిటీ రైడ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కైలాసగిరికి కొత్త రోప్‌వే నిర్మాణానికి ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఉన్న పాత రోప్‌వేను తొలగించి కొత్తది ఏర్పాటు చేయడానికి ఏడాది నుంచి టెండర్లు పిలుస్తుంటే ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిసారి కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ప్రస్తుత కాంట్రాక్టరే ఎల్‌-1గా నిలవడంతో పనులు అప్పగించడానికి ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం తీసుకున్నారు. ఇక పనులు ప్రారంభించడమే మిగిలింది.

కైలాసగిరిపైకి వెళ్లడానికి మెట్లు, రోడ్డు మార్గం కాకుండా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) వినూత్నంగా పర్యాటక ఆకర్షణ కోసం 2004లోనే రోప్‌వేను అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిని అప్పుఘర్‌ వద్ద రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేశారు. దాని జీవిత కాలం రెండు దశాబ్దాలు. అది పూర్తయిపోయింది. ప్రస్తుతం నిర్వహణ సరిగ్గానే ఉన్నప్పటికీ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని భావించి ఇంతకు ముందు కమిషనర్‌గా పనిచేసిన విశ్వనాథన్‌ కొత్త రోప్‌వే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పాతది తొలగించి, కొత్త రోప్‌వేను కొండ పైనుంచి తెలుగు మ్యూజియం వరకు పెంచాలని సూచించారు. దీని పొడవు 1.5 కి.మీ. వరకు ఉంటుందని అంచనా వేశారు. దాంతో పాటు సింగపూర్‌ తరహాలో భూమ్యాకర్షణ శక్తితో పనిచేసే లూజ్‌ గ్రావిటీ రైడ్‌ను కూడా పెట్టాలని డిజైన్లు రూపొందించారు. వీటికి టెండర్లు పిలిస్తే ఎవరూ ముందుకు రాలేదు. మరోసారి టెండర్‌ పిలిస్తే ఒక్కరే టెండర్‌ వేశారు. ఎక్కువ ఖర్చు అవుతుందని, ఆదాయంలో వాటా పెంచాలంటూ కొన్ని షరతులు పెట్టారు. దాంతో ఆ ప్రాజెక్టు ఏడాది పాటు ఆగిపోయింది. పాత రోప్‌వేనే నడుపుతున్నారు. ఇక లాభం లేదని ఇప్పుడు రోప్‌వే నడుపుతున్న సంస్థే కొత్త రోప్‌వే నిర్మాణానికి ముందుకువచ్చింది. సంప్రతింపులు, ఉన్నతాధికారులతో భేటీలు అన్నీ పూర్తయిన తరువాత ఎల్‌-1 కింద ఆ సంస్థకే కాంట్రాక్టు ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలు కూడా త్వరలోనే అందించి పనులు ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. లూజ్‌ గ్రావిటీ రైడ్‌ని శివ పార్వతుల విగ్రహం దగ్గర నుంచి సుమారుగా 600 మీటర్ల పొడవున ఏర్పాటు చేస్తారు.

సీఎం ఆదేశం మేరకు కొత్త పనులు

ప్రణవ్‌ గోపాల్‌, చైర్మన్‌, వీఎంఆర్‌డీఏ.

కైలాసగిరిని పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మార్చాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆ మేరకు గ్లాస్‌ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చాం. స్కై సైక్లింగ్‌తో పాటు త్రిశూలం, ఢమరుకం, లేపాక్షి నంది ఏర్పాటు చేశాం. తెలుగు మ్యూజియం వద్దకు రవాణా సౌకర్యం పెంచితే అక్కడ కూడా సందర్శకుల సంఖ్య పెరుగుతుందని రోప్‌వేను అక్కడి వరకు పొడిగించాం. లూజ్‌ గ్రావిటీ రైడ్‌ కూడా విదేశాల్లోనే ఉంది. దాన్ని విశాఖ ప్రజలకు పరిచయం చేస్తాం.


రైతుబజార్లపై కొరవడిన పర్యవేక్షణ

రేట్లు తగ్గినా, పెరిగినా... బోర్డులో ఆలస్యంగా మార్పులు

అదనపు సిబ్బంది వచ్చినా అదే నిర్లక్ష్యం

విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):

రైతుబజార్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవైంది. బజార్లలో ఏమి జరుగుతున్నదో పట్టించుకోవడం లేదు. అదనపు సిబ్బందిని సమకూర్చినా బజార్లలో మార్పులు కనిపించడం లేదు. ఏవైనా కూరగాయల ధరలు తగ్గిగే...ఆ రోజు ధరల బోర్డులో ఆ విషయం స్పష్టంగా పేర్కొనడం లేదు. ఉదయం ఏడు గంటలకు రైతుబజార్లలో లావాదేవీలు మొదలవుతుండగా ఎనిమిది గంటలు దాటిన తరువాత తీరుబడిగా బోర్డులపై ధరలు మారుస్తున్నారు. ఈలోగా రైతులు, డ్వాక్రా గ్రూపులు పాత రేటు ప్రకారం డబ్బులు తీసుకుంటారు. కొన్ని స్టాళ్లలో అసలు బోర్డులే మార్చడం లేదు. దీనిపై తరచూ ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. నరసింహనగర్‌ రైతుబజారులో అయితే మరీ ఘోరంగా ఉంది. అక్కడ బోర్డుపై ఎప్పుడు ధరలు మారుస్తారో వారికే తెలియడం లేదు. ఇటీవల రైతుబజార్లకు ఎస్టేట్‌ అధికారి, అటెండర్లకు తోడుగా మధ్యలో సూపర్‌వైజర్లను నియమించారు. వారు ఎస్టేట్‌ అధికారి గదిలోని కుర్చీలో కూర్చొని సెల్‌ఫోన్‌లో రీల్స్‌ చూసుకోవడం తప్ప విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. రాజకీయ పలుకుబడితో వచ్చామని, ఎవరూ ఏమీ చేయలేరని ధీమా ప్రదర్శిస్తున్నారు. రీల్స్‌ చూసుకోవడానికేనా వారికి నెలకు రూ.16 వేలు జీతం ఇస్తున్నారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:54 AM