బెల్లంపై కొత్త పరిశోధనలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:26 AM
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) పోస్టు హార్వెస్టు టెక్నాలజీ విభాగానికి మూడు కొత్త పరిశోధన ప్రాజెక్టులను భారత వ్యవసాయ పరిశోధన మండలి మంజూరు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత విభాగాధిపతి డాక్టర్ పీవీకే జగన్నాథరావు మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు.
ఆర్‌ఏఆర్‌ఎస్‌కు మూడు ప్రాజెక్టులు
పోషక విలువలు, నిల్వ సామర్థ్యం పెంపు, నిషేధిత రసాయనాల వినియోగం గుర్తింపుపై పరిశోధనలు
శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథరావు
అనకాపల్లి అగ్రికల్చర్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) పోస్టు హార్వెస్టు టెక్నాలజీ విభాగానికి మూడు కొత్త పరిశోధన ప్రాజెక్టులను భారత వ్యవసాయ పరిశోధన మండలి మంజూరు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత విభాగాధిపతి డాక్టర్ పీవీకే జగన్నాథరావు మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. బెల్లంలోని పోషక విలువలపై శాస్ర్తీయ పరిశోధనలు జరిపి వాటిని ప్రమాణీకరించేందుకు ఒక ప్రాజెక్టు మంజూరైందని చెప్పారు. పంచదార కన్నా బెల్లం వినియోగం ఆరోగ్యానికి మంచిదేనా? బెల్లంలో ఐరన్ తదితర పోషక విలువలు ఉన్నాయా? అనే అంశాలపై శాస్ర్తీయమైన ఆధారాల కోసం ఈ పరిశోధన జరుగుతుందని జగన్నాథరావు వివరించారు. బెల్లంలో గ్లైసిమిక్ ఇండెక్స్‌పై కూడా పరిశోధనలు చేపడతామన్నారు. బెల్లం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టేందుకు మరొక ప్రాజెక్టు కూడా మంజూరు అయ్యిందన్నారు. అల్లం రసం, పసుపు కొమ్ముల నుంచి తీసిన నూనె, మునగాకు రసం వంటి వాటిని బెల్లం తయారీలో ఉపయోగించడం వల్ల నిల్వ సామర్థ్యం పెరుగుతుందా? అన్న వాటిపై పరిశోధిస్తామన్నారు. ఎలాంటి ప్యాకేజింగ్ సామగ్రిని ఉపయోగిస్తే బెల్లం నిల్వ, రవాణా మెరుగ్గా వుంటాయన్న అంశంపై పరిశోధిస్తామన్నారు. చిన్నపాటి అచ్చులు, బెల్లం పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు ప్రస్తుత పద్ధతులు ఉపయోగపడుతున్నాయని, అయితే 10-15 కిలోల బెల్లం దిమ్మల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రధానంగా పరిశోధనలు జరుగుతాయని చెప్పారు. బెల్లం రుచి, రంగు కోసం నిషిద్ధ రసాయనాలను వినియోగించనట్టయితే ఆ విషయాన్ని తెలుసుకునేందుకు అవసరమయ్యే బయో సెన్సర్‌లను కనుగొనేందుకు మరొక పరిశోధన ప్రాజెక్టు కూడా మంజూరైదని జగన్నాథరావు తెలిపారు.