కేజీహెచ్‌లో కొత్తగా ఓపీ బ్లాక్
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:58 AM
రోగుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కేజీహెచ్‌లో కొత్తగా ఓపీ (అవుట్ పేషెంట్) బ్లాక్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
జీ+3 విధానంలో భవన నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలు
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆధునికీకరణకు రూ.49 కోట్లతో ప్రణాళికలు
మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బ్లాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
రోగుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కేజీహెచ్‌లో కొత్తగా ఓపీ (అవుట్ పేషెంట్) బ్లాక్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆస్పత్రికి గతంలో వెయ్యి నుంచి 1,800 మంది రోగులు వచ్చేవారు. ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు వస్తున్నారు. దీంతో ఓపీ కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు ఉంటున్నాయి. ఓపీ చీటీ తీసుకునేందుకు కనీసం 30 నుంచి 50 నిమిషాలు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికిగాను ఓపీ కౌంటర్లను భారీగా పెంచేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపీ బ్లాక్ వద్ద రూ.49 కోట్ల వ్యయంతో జీ+3 విధానంలో ఓపీ బ్లాక్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సానుకూల స్పందన వచ్చినట్టు చెబుతున్నారు. ప్రతి రెండు విభాగాలకు ఒక్కో ఓపీ కౌంటర్‌ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎంతమంది వచ్చినా పది నిమిషాల్లో ఓపీ కౌంటర్ నుంచి వెళ్లిపోయేలా ఈ బ్లాక్ నిర్మాణం ఉంటుందని ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్ బీవీ రమణ తెలిపారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆధునికీకరణ
కేజీహెచ్‌లో ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అయితే, కొన్నేళ్ల కిందట ఏర్పాటుచేసినది కావడంతో అనేకచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల పైప్‌లైన్లు, మరికొన్నిచోట్ల మ్యాన్ హోల్స్ దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆధునికీకరణ చేపట్టేందుకు రూ.1.8 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో కొద్దిరోజుల్లోనే ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి..
కేజీహెచ్‌లో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బ్లాక్ ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో అధికారులు భావిస్తున్నారు. గతంలో అనేకసార్లు ప్రతిపాదనలు పెట్టినప్పటికీ అనుమతి రాలేదు. అయితే, ఇటీవల ఆస్పత్రి అధికారులు, కేజీహెచ్, పీడియాట్రిక్ విభాగానికి చెందిన వైద్యులు ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వానికి వివరించారు. దీంతో ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం కోరడంతో తాజాగా ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు కోసం రూ.110 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గైనిక్ విభాగం ఉన్న భవనాన్ని కూల్చి అక్కడే జీ+5 విధానంలో భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. ఈ మూడింటిలో రెండు పనులను త్వరలో ప్రారంభిస్తామని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కానున్నాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.