కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:21 AM
జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం సోమవారం జరగనున్నది.
23న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
తొలుత మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
డిప్యూటీ మేయర్‌పై సస్పెన్స్
తమకే కేటాయించినట్టు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రకటన
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం సోమవారం జరగనున్నది. అందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జీవీఎంసీకి గత నెల 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మేయర్‌గా కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి గెలుపొందగా, 120 వార్డుల్లో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ ఎనిమిది, వైసీపీ 13, సీపీఎం ఒక వార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. మరో ఎనిమిది వార్డుల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన మునిసిపల్ కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో మేయర్/చైర్మన్‌లతోపాటు కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ఈనెల 23న ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేయించడంతోపాటు డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కొత్త కార్యవర్గం ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించేందుకు ఏర్పాట్లుపూర్తిచేశారు. ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహిస్తారు. తొలుత మేయర్, కార్పొరేటర్లతో ప్రమాణం చేయిస్తారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. కూటమి బలపరిచిన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కానున్నారు.
డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకి కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, జనసేనకు ఇచ్చారని, అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆ పార్టీకి చెందిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ శనివారం ప్రకటించారు. జనసేన నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఆ పార్టీతోపాటు ఇతర పార్టీల్లోనూ రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
మేయర్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధం
జీవీఎంసీ మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అంశంపై సందిగ్ధం నెలకొంది. శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు శుక్రవారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తండ్రి మృతితో శ్రావణి తీవ్ర విషాదంలో ఉన్నారు. దీంతో సోమవారం జరిగే జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి ఆమె హాజరవడం అనుమానమేనని అధికారులు భావిస్తున్నారు. పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఆమె సమావేశానికి హాజరై, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్లిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. సభ్యులకు అక్షర క్రమంలో కుర్చీలను కేటాయించనున్నారు. ఎవరి స్థానంలో వారి పేరుతో నేమ్‌ప్లేట్ ఏర్పాటుచేస్తున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో చేతులు ఎత్తిన సభ్యులను లెక్కించేందుకు వీలుగా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.