కంబాలకొండకు కొత్త సొబగులు
ABN , Publish Date - May 07 , 2026 | 01:06 AM
జంగిల్ బెల్స్...ట్రెక్కింగ్...అడవిలో అర్ధరాత్రి గడిపిన అనుభూతి కోసం పర్యాటకులు ఇప్పుడు నగరానికి దూరంగా అరకులోయో, అనంతగిరో వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంచక్కా కంబాలకొండలోనే అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. జాతీయ రహదారిపై జంతుప్రదర్శనశాలకు ఎదురుగా ఉన్న వన్యప్రాణుల అభయారణ్యంలో అందుకు పూర్తి ఏర్పాట్లుచేశారు. త్వరలోనే వీటిని ప్రారంభిస్తున్నారు.
పర్యాటకంగా అభివృద్ధికి ఏర్పాట్లు
రాత్రి బస కోసం కాటేజీల నిర్మాణం
వయస్సుల వారీగా ట్రెక్కింగ్ మార్గాలు
ఎక్కడికక్కడ ఎత్తైన టవర్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జంగిల్ బెల్స్...ట్రెక్కింగ్...అడవిలో అర్ధరాత్రి గడిపిన అనుభూతి కోసం పర్యాటకులు ఇప్పుడు నగరానికి దూరంగా అరకులోయో, అనంతగిరో వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంచక్కా కంబాలకొండలోనే అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. జాతీయ రహదారిపై జంతుప్రదర్శనశాలకు ఎదురుగా ఉన్న వన్యప్రాణుల అభయారణ్యంలో అందుకు పూర్తి ఏర్పాట్లుచేశారు. త్వరలోనే వీటిని ప్రారంభిస్తున్నారు.
అటవీ పర్యాటకం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘నగర వనయోజన’ పేరుతో కొత్త పథకం అమలు చేస్తోంది. కర్ణాటకలో దీనిని ఉపయోగించుకొని నగరానికి దగ్గర్లోనే అటవీ ప్రాంతంలో పర్యాటకులు రాత్రి బస చేసిన అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి మంచి ఆదరణ లభించడంతో ఆ తరహాలోనే విశాఖలో కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి పనులు చేపట్టింది. ఎంపీ శ్రీభరత్ చొరవతో జూ, కంబాలకొండలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ఇటీవల సింగపూర్ జూ బృందం వచ్చి అధ్యయనం చేసింది. వీఎంఆర్‌డీఏ కూడా కైలాసగిరితో పాటు జూ, కంబాలకొండలను పర్యాటకంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతా కలిసి పర్యాటకంపైనే దృష్టి పెట్టడంతో ముందుగా పర్యాటకులకు వసతులు కల్పించేందుకు అటవీ శాఖ రెండు కోట్ల రూపాయల వ్యయంతో కంబాలకొండలో ఐదు కాటేజీలు నిర్మించింది. మరో ఐదు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. రాత్రి బస చేసిన వారు తెల్లవారి లేచిన తరువాత ట్రెక్కింగ్ చేయడానికి 3/5/7 కి.మీ. చొప్పున వేర్వేరుగా వయస్సుల వారీగా మార్గాలు ఏర్పాటుచేశారు. ఇంకా పరిసర ప్రాంతాలను తిలకించడానికి ఎత్తైన టవర్, ఉడెన్ బ్రిడ్జిలు, నేచర్ వాక్ మార్గాలు, రోప్ వాకింగ్, బోటింగ్, వ్యూ పాయింట్లు వంటివి ఏర్పాటుచేశారు. ఇప్పుడు కంబాలకొండకు ప్రతి రోజూ 200 మంది, వారాంతాల్లో 500 నుంచి 600 మంది వస్తున్నారు. కాటేజీలను అద్దెకు ఇస్తే, వారికి ఆహారం, ఇతర సేవలు అందించేందుకు 25 మంది గిరిజన యువతకు ఉపాధి కల్పించనున్నారు. కాటేజీల అద్దె, ఇతరత్రా రేట్లు ఖరారు చేసి, వీలైనంత త్వరగా వీటిని ఉపయోగంలోకి తీసుకువస్తామని అటవీ వర్గాలు తెలిపాయి.