Share News

నూతనోత్సాహం

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:15 PM

మన్యంలోని పర్యాటక ప్రాంతాలు గురువారం కిటకిటలాడాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది.

నూతనోత్సాహం
చెరువులవేనంలో పర్యాటకులు

నూతన సంవత్సరం నేపథ్యంలో పర్యాటకుల సందడి

మన్యంలోని పర్యాటక ప్రాంతాలు కిటకిట

చింతపల్లి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాలు గురువారం కిటకిటలాడాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది.

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. నూతన సంవత్సరానికి లంబసింగిలో స్వాగతం పలికేందుకు పలు ప్రాంతాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఎక్కువ మంది పర్యాటకులు బుధవారం సాయంత్రానికి లంబసింగి చేరుకుని స్థానికంగా బస చేశారు. కొంత మంది పర్యాటకులు బహిరంగ మైదానాల్లో టెంట్లు వేసుకోగా, మరికొంత మంది రిసార్ట్స్‌లో బస చేశారు. ఓ వైపు వణికిస్తున్న చలిలో అర్ధరాత్రి వరకు నిరీక్షించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతో లంబసింగిలో రాతంత్రా సందడి వాతారణం నెలకొంది. గురువారం ఉదయం యథావిధిగా పర్యాటకులు చెరువులవేనం, తాజంగి జలాశయాన్ని సందర్శించారు. మంచు అందాలను అస్వాదిస్తూ ఎంజాయ్‌ చేశారు. జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటింగ్‌ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి.

వంజంగి మేఘాల కొండపై...

పాడేరురూరల్‌: వంజంగి మేఘాల కొండపై గురువారం వేకువజామున పర్యాటకులు సందడి చేశారు. పలువురు పర్యాటకులు బుధవారం రాత్రికే వంజంగి చేరుకొని అక్కడ రిసార్ట్స్‌, టెంట్లలో బస చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. గురువారం ఉదయం వంజంగి మేఘాల కొండను పర్యాటకులు సందర్శించి దట్టంగా పరుచుకున్న మంచు మేఘాలను, సూర్యోదయాన్ని ఆస్వాదించారు. గురువారం మేఘాల కొండను 1,164 మంది సందర్శించగా, ఎకో టూరిజానికి రూ.65,470 ఆదాయం వచ్చిందని అటవీశాఖ డీఆర్‌వో కె.కాళిప్రసాద్‌ తెలిపారు.

కొత్తపల్లి జలపాతం వద్ద..

జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉత్సాహంగా గడిపారు. స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు.

Updated Date - Jan 01 , 2026 | 11:15 PM