Share News

కొత్త కలెక్టర్‌ బాధ్యతల స్వీకారం రేపు

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:29 AM

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.

కొత్త కలెక్టర్‌ బాధ్యతల స్వీకారం రేపు

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మంగళవారం రాత్రికి నగరానికి చేరుకుని పోర్టు అతిథి గృహంలో బస చేయనున్నారు. ప్రస్తుత కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ బుధవారం నూతన కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు.


డ్వామా పీడీగా నిర్మల

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా భీమిలి డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి నిర్మలను నియమించారు. ఇప్పటివరకు డ్వామా పీడీగా పనిచేసిన ఆర్‌. పూర్ణిమాదేవిని పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణాధికారిగా బదిలీ అయ్యారు.


సిలిండర్ల కోసం నిరీక్షణ

జిల్లాలో 1.82 లక్షల మంది ఎదురుచూపు

15,16,17 తేదీల్లోనే లక్ష వరకు బుకింగ్‌

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

గ్యాస్‌ సిలిండర్ల కోసం నిరీక్షిస్తున్న వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. గ్యాస్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చమురు కంపెనీలు, ప్రభుత్వ అధికారులు చెబుతున్నా సరఫరా మాత్రం మెరుగుపడలేదు. సిలిండర్‌ బుక్‌ చేసుకున్నవారు పది నుంచి పదిహేను రోజులు వేచిచూడాల్సి వస్తోంది.

జిల్లాలోని 61 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో 8.33 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. సిలిండర్‌ కోసం సోమవారం నాటికి 1,82,837 మంది నిరీక్షిస్తున్నారు. వీరిలో హెచ్‌పీసీఎల్‌ వినియోగదారులు 1,12,428 మంది, బీపీసీఎల్‌ కంపెనీ వినియోగదారులు 15,988 మంది, ఐవోసీ వినియోగదారులు 54,421 మంది ఉన్నారు. సోమవారం నాటికి జిల్లాలో 36,490 సిలిండర్లు ఉండగా, 20,648 సిలిండర్లు సరఫరా చేశారు. యుద్ధం నేపథ్యంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు సుమారు లక్ష మంది సిలిండర్ల బుక్‌ చేశారు. ఆ తరువాత ప్రతిరోజు కనీసం 20 వేల మంది సిలిండర్‌ కోసం బుక్‌ చేస్తున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ మధ్య బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ఇంకా సిలిండర్లు సరఫరా చేయవలసి ఉంది. ఆ జాబితాను పూర్తిగా క్లియర్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ సమయం పెంచడంతో వినియోగదారుల తాకిడి స్వల్పంగా తగ్గిందని అంటున్నారు.


1,58,186 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ రేపు

విశాఖపట్నం, 30 (ఆంధ్రజ్యోతి):

సామాజిక పింఛన్లు బుధవారం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. మార్చి నెలకు సంబంధించి జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,58,186 మందికి రూ.69.55 కోట్ల్లు మంజూరయ్యాయి. నాలుగు గ్రామీణ మండలాల్లో 25,855 మందికి రూ.11.08 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,31,919 మందికి రూ.58.46 కోట్లు మంజూరయ్యాయి. పింఛన్‌ సొమ్ము మంగళవారం సచివాలయాల సిబ్బందికి అందజేస్తామని, వారంతా బుధవారం పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారన్నారు.


ఐపీఎల్‌ నేపథ్యంలో బెట్టింగ్‌లపై నిఘా

సీపీ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌ నియంత్రణకు నిఘా ఏర్పాటుచేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెట్టింగ్‌ యాప్‌లు, నిర్వాహకులపై ప్రత్యేక బృందాలు ప్రత్యేకదృష్టి పెడతాయన్నారు. బుకీలు, బెట్టింగ్‌ను ప్రోత్సహించేవారితోపాటు బెట్టింగ్‌కు పాల్పడిన వారిపై కూడా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈజీ మనీ కోసం పిల్లలు ఎవరైనా బెట్టింగ్‌వైపు మళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.


నేటి నుంచి సదరం శిబిరాలు

జిల్లాలోని తొమ్మిది ఆస్పత్రుల్లో నిర్వహణ

దివ్యాంగులకు పరీక్షలు

నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

దివ్యాంగుల వైకల్యాన్ని నిర్ధారించేందుకు సదరం వైద్య శిబిరాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి సదరం స్లాట్‌ బుకింగ్‌కు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటివరకు 16 రకాల వైకల్యాలకు మాత్రమే సర్టిఫికెట్లు మంజూరు చేస్తుండగా, కూటమి ప్రభుత్వం కొత్తగా మరో ఐదింటిని జాబితాలో చేర్చింది. 21 రకాల వైకల్యాలతో బాధపడుతున్న వారంతా స్లాట్స్‌ బుక్‌ చేసుకుని, తమకు కేటాయించిన ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని తొమ్మిది ఆస్పత్రుల్లో సదరం ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్టు ఆస్పత్రి సేవల జిల్లా సమన్వయకర్త తెలిపారు. ఈ నెల 31 నుంచి సదరం వైద్య శిబిరాలు ప్రతి మంగళవారం కేటాయించిన ఆస్పత్రుల్లో కొనసాగనున్నాయి.

ఈ ఆస్పత్రుల్లో నిర్వహణ

ఎముకలు, కండరాలు, కీళ్లు, నరాల బలహీనత వంటి కారణాల వల్ల నడవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి కేజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రమాదాలు, పుట్టుకతో వెన్ను, ఎముకలు సంబంధిత సమస్యలు వల్ల వైకల్యంతో బాధపడేవారికి కూడా పరీక్షలు నిర్వహిస్తారు. విమ్స్‌, అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రి, భీమిలి, గోపాలపట్నం, పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పెదవాల్తేరులోని చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి, రామాటాకీస్‌ సమీపంలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రి, పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో సంబంధిత వైకల్యంతో బాధపడే వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు మార్చి 31 నుంచి మే 30 వరకు ప్రతి మంగళవారం నిర్వహించనున్నామని ఆస్పత్రి సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌.నరేంద్రసింగ్‌ తెలిపారు. కేటాయించిన ఆస్పత్రులకు మాత్రమే దివ్యాంగులు వెళ్లాలని స్పష్టం చేశారు.

Updated Date - Mar 31 , 2026 | 01:29 AM