అప్పన్నకు కొత్త రథం
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:30 AM
భక్తుల సౌకర్యార్థం ‘ప్రసాద్’ పథకం కింద నిర్మించిన నూతన క్యూకాంప్లెక్స్‌లో రూ.15 కోట్లతో స్టీల్ రైలింగ్ ఏర్పాటు, దేవస్థానం భూముల రక్షణకు రూ.2.5 కోట్లతో సుమారు 7.5 కిలోమీటర్ల నిడివి ప్రహరీగోడ నిర్మాణానికి సింహాచలం దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది.
భూముల రక్షణకు రూ.2.5 కోట్లతో ప్రహరీ గోడ నిర్మాణం
నూతన క్యూకాంప్లెక్స్‌లో
రూ.15 కోట్లతో స్టీల్ రైలింగ్ ఏర్పాటు
ఆలయ దక్షిణ ప్రాకారం నిర్మాణం,
మెట్లమార్గం అభివృద్ధి...
ఏకగ్రీవంగా ఆమోదించిన సింహాచలం దేవస్థానం పాలకమండలి ఆమోదం
సింహాచలం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
భక్తుల సౌకర్యార్థం ‘ప్రసాద్’ పథకం కింద నిర్మించిన నూతన క్యూకాంప్లెక్స్‌లో రూ.15 కోట్లతో స్టీల్ రైలింగ్ ఏర్పాటు, దేవస్థానం భూముల రక్షణకు రూ.2.5 కోట్లతో సుమారు 7.5 కిలోమీటర్ల నిడివి ప్రహరీగోడ నిర్మాణానికి సింహాచలం దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు వర్చువల్‌గా పాల్గొనగా, కృష్ణాపురంలో దేవస్థానానికి చెందిన నృసింహవనంలో బుధవారం పాలక మండలి రెండో సమావేశం జరిగింది. పాలక మండలి 65 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అందులో అత్యధికం గతంలో జరిగిన చందనోత్సవం, గిరి ప్రదక్షిణ సమయంలో చేసిన ఖర్చులకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని స్వల్ప చర్చతో సమావేశం ఆమోదించింది. ఆ వివరాలను మీడియాకు ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఆలయ దక్షిణ ప్రాకారం నిర్మాణం, మెట్లమార్గం సౌకర్యవంతంగా అభివృద్ధి చేయడం, స్వామివారి వార్షిక కల్యాణోత్సవంలో వినియోగించే పురాతన రథం స్థానంలో నూతన రథం నిర్మాణానికి పాలక మండలి పచ్చజెండా ఊపింది. పర్యావరణ పరిరక్షణకు, అదేవిధంగా గతంలో కేటాయించిన పది ఎకరాలతోపాటు అదనంగా మరొక 20 ఎకరాల విస్తీర్ణంలో చందనం చెట్ల పెంపకాన్ని చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. అదేవిధంగా కొండదిగువన తొలిపావంచా, నరసింహ సదన్, సింహగిరిపై కేశఖండనశాల, పాదాలమ్మ వారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అదనంగా మరుగుదొడ్లు నిర్మించనున్నారు. సింహగిరిపై పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడతారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు మాకెన సీతారామ్, కసిరెడ్డి దామోదర్, కరక దేవుడు, కనకాల మురళీమోహన్, వెంపడపు అన్నపూర్ణ, బీతాల నీరజలక్ష్మీకుమారి, మధుపాడ సన్యాసిరావు, డాక్టర్ ధరణి బండ్ల, నీటిపల్లి మహేష్, పెద్దిశెట్టి ఉషశ్రీ, గుత్తికొండ శ్రీలత, సురవరపు గణపతిరావు, చల్లంగి జ్ఞానేశ్వరి, పావులూరి శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులు స్వామినాయుడు, దక్షిణామూర్తి, ఎక్స్‌అఫిషియో మెంబర్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.