కాన్వెంట్ జంక్షన్-గోస్తనీ గేటు మార్గంలో కొత్త వంతెన రెడీ
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:02 AM
కాన్వెంట్ జంక్షన్ నుంచి డాక్‌యార్డు గోస్తనీ గేటు వరకూ ఎగువన నిర్మించిన భారీ వంతెనపై ఆదివారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు ప్రారరంభం కానున్నాయి.
నేటి నుంచి వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్
రెండేళ్ల తరువాత వినియోగంలోకి...
పారిశ్రామిక ప్రాంతవాసులకు తీరనున్న రవాణా కష్టాలు
మల్కాపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):
కాన్వెంట్ జంక్షన్ నుంచి డాక్‌యార్డు గోస్తనీ గేటు వరకూ ఎగువన నిర్మించిన భారీ వంతెనపై ఆదివారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు ప్రారరంభం కానున్నాయి. దాదాపు రెండేళ్ల తరువాత ఈ వంతెన వినియోగంలోకి వస్తుండడంతో పారిశ్రామిక ప్రాంతం, గాజువాక ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. అయితే నగరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీఐపీల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ కార్యక్రమాలు ముగిసిన తరువాత ప్రజల రాకపోకలకు అనుమతిస్తారని తెలిసింది.
2024లో డాక్‌యార్డు సమీపంలో ఉన్న సర్దార్ పటేల్ వంతెన, డాక్‌యార్డు గోస్తనీ గేటు నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకూ ఎగువన ఉన్న వంతెనల పునర్నిర్మాణ పనులు చేపట్టారు. తొలుత పటేల్ వంతెన నిర్మాణం పూర్తిచేసి, ఇటీవల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతం నుంచి వెళ్లేవారు డాక్‌యార్డు వంతెన దాటిన తరువాత ఎస్‌ఆర్ కంపెనీ ముందు నుంచి దిగువలో ఉన్న వంతెన మీదుగా కాన్వెంట్ జంక్షన్‌కు చేరుకుంటున్నారు. నగరం నుంచి వచ్చేటప్పుడు పోర్టురోడ్డులో ఆరు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. ఇప్పుడు కాన్వెంట్ జంక్షన్ నుంచి గోస్తనీ గేటు వరకు నిర్మించిన భారీవంతెన ప్రారంభం కానున్నందున ప్రయాణ కష్టాలు తీరినట్టేనని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ వంతెన పక్క నుంచి కూడా కొత్తగా రోడ్డు వేశారు. ఈ మార్గం కూడా రాకపోకలకు అనువుగా ఉంది.