Share News

గాలి నాణ్యత నిర్ధారణపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:21 AM

రాష్ట్రంలో అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపుపొందిన విశాఖపట్నంలో గాలి నాణ్యత నిర్ధారించే యంత్రాలను మరిన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు.

గాలి నాణ్యత నిర్ధారణపై నిర్లక్ష్యం

జీవీఎంసీ మొత్తానికి ఒక్కచోటే ఆన్‌లైన్‌ ఎయిర్‌ క్వాలిటీ మిషన్‌

మరికొన్నిచోట్ల ఏర్పాటుచేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు

కనీసం రెండు, మూడైనా అవసరం

కేంద్ర నిధుల కోసం అధికారుల ఎదురుచూపులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపుపొందిన విశాఖపట్నంలో గాలి నాణ్యత నిర్ధారించే యంత్రాలను మరిన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. సుమారు 625 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న నగరం మొత్తానికి ఆన్‌లైన్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మిషన్‌ (జీవీఎంసీ ప్రధాన కార్యాలయ భవనంపై) ఒక్కటే ఉంది. దీని ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్‌ పరిసరాల్లో నమోదైన కాలుష్యం తీవ్రత మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదవుతుంది.

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తొమ్మిదిచోట్ల ప్రతి వారం రెండు రోజులు ఆఫ్‌లైన్‌లో వాయు నాణ్యత ప్రమాణాలను కొలుస్తుంటారు. వాటితోపాటు జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆన్‌లైన్‌ యంత్రం నుంచి వచ్చే వివరాలు కలిపి సగటు తీసుకోవాలి. కానీ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న ఆన్‌లైన్‌ మిషన్‌లో నమోదైన రీడింగ్స్‌ (అన్నిరకాల వాయు నాణ్యత వివరాలు)ను మాత్రమే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిగణనలోకి తీసుకుంటుంది. ఆఫ్‌లైన్‌లో నమోదైన వివరాలను పట్టించుకోకపోవడంతో నగరంలోని ఇతర ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో చెప్పడం కష్టంగా మారింది. రెండు పోర్టులు, ఎన్టీపీసీ, విశాఖ ఉక్కు కర్మాగారం, కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం, హెచ్‌పీపీఎల్‌, ఫార్మాసిటీ, ఇతర పరిశ్రమలు, 15 లక్షలకు పైగా వాహనాలు, పెద్దఎత్తున జరిగే నిర్మాణాలతో వెలువడే కాలుష్యాన్ని కచ్చితంగా నిర్ధారించేలా ఆన్‌లైన్‌ గాలి నాణ్యత యంత్రాలు లేవు.

అక్కడ నాలుగు...

విజయవాడలో నాలుగు ఆన్‌లైన్‌ వాయు నాణ్యత నిర్ధారణ యంత్రాలు ఉన్నాయి. ఢిల్లీలో పదుల సంఖ్యలో ఉన్నాయి. విశాఖ పరిధిలో విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, ఎన్టీపీసీ, హిందూజా పవర్‌ప్లాంటు, విశాఖ స్టీల్‌ప్లాంటు, కోరమాండల్‌, ఫార్మాసిటీ ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రత పరిమితి కంటే ఎక్కువగా నమోదవుతుంది. అక్కడ వివరాలు ఎప్పటికప్పుడు నమోదుచేయాలంటే ఆన్‌లైన్‌ యంత్రాలు అవసరమని పర్యావరణ నిపుణులు వెల్లడించారు. వేసవి, శీతాకాలంలో పోర్టు పరిసరాల్లో దుమ్ము, ధూళి కాలుష్యం అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కోట వీధి వెనుక ఉన్న వేదాంత బెర్తు నుంచి బాక్సైట్‌ ఖనిజం దిగుమతి చేసే సమయంలో వన్‌టౌన్‌ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ నేపథ్యంలో నగరంలో మరో రెండు లేదా మూడు ఆన్‌లైన్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ యంత్రాలు అవసరమని గుర్తించారు. మధురవాడ, గాజువాక/మల్కాపురం ప్రాంతాల్లో రెండు ఆన్‌లైన్‌ యంత్రాలు ఏర్పాటుచేయాలని కాలుష్య నియంత్రణ మండలి చాలాకాలం క్రితం ప్రతిపాదించింది. ఒక్కో యంత్రం ఏర్పాటుకు సుమారు రూ.కోటిన్నర ఖర్చవుతుంది. కానీ కేంద్రం ఇంతవరకూ నిధులు మంజూరు చేయలేదు.

నగరంలో కాలుష్యం తగ్గించే పనులకు నిధులు ఇస్తుంటే జీవీఎంసీ అధికారులు బీచ్‌రోడ్డును పదేపదే మరమ్మతులు చేయడం, కూడళ్ల వద్ద ముస్తాబు పనులకు ఖర్చుచేస్తున్నారు. ఆన్‌లైన్‌ గాలి నాణ్యత నిర్ధారణ యంత్రాలపై దృష్టిసారించడం లేదు. అనవసర పనులకు రూ.కోట్లలో ఖర్చుచేసే జీవీఎంసీ ఈ యంత్రాలను సొంతంగా సమకూర్చుకోవడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో యంత్రాల ఏర్పాటుచేయాలని ఎంపీ శ్రీభరత్‌ ఇటీవల కేంద్ర ఓడరేవుల శాఖా మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - Aug 13 , 2026 | 01:21 AM