Share News

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమా?

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:30 AM

‘‘సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపించకపోవడం సరికాదు. సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వంగా వుంటే కుదరదు’’ అని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను హెచ్చరించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమా?
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, పక్కన జేసీ శౌర్యమాన్‌పటేల్‌, ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు

ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు

అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

సమస్యల పరిష్కారానికి ‘ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటన’ల కార్యక్రమం మరో వారం పొడిగింపు

చోడవరం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపించకపోవడం సరికాదు. సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వంగా వుంటే కుదరదు’’ అని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ‘ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటన’ల కార్యక్రమం ముగింపు సందర్భంగా శాఖల వారీగా వచ్చిన అర్జీలు, వాటికి అధికారులు చూపించిన పరిష్కారాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌ మాట్లాడుతూ, నాలుగు పర్యటనల సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో, ఈ కార్యక్రమాన్ని మరో వారం పొడిగిస్తున్నట్టు చెప్పారు. ‘ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటన’ల కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు సంబంధించి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ కార్యక్రమంపై సమీక్ష ఉంటుందన్నారు. అనంతరం నాలుగు పర్యటనల సందర్భంగా వచ్చిన అర్జీలను శాఖల వారీగా సమీక్షించారు. గత మూడు వారాల్లో వచ్చిన 1,346 అర్జీల్లో ఎన్నింటిని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్‌లో వున్నాయి, ఎప్పటిలోగా పరిష్కరిస్తారు అన్నదానిపై ఆయా శాఖ అధికారులతో మాట్లాడారు.

కాగా ‘ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటన’ల కార్యక్రమంలో భాగంగా చివరిదైన నాలుగో వారం కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తాము ఎంతో కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఆన్‌లైన్‌ చేయడంలో నిర్లక్ష్యంతోపాటు పట్టాలు కూడా ఇవ్వడం లేదని రోలుగుంట మండలం జడ్‌.జోగంపేట ప్రాంతానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. గోవాడ చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలని ఏపీ రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. చోడవరం నుంచి పీఎస్‌పేట మీదుగా జన్నవరం వరకు రహదారిని బాగు చేయాలని పీఎస్‌పేట రూటు ఆటో డ్రైవర్లు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఇన్‌చార్జి డీఆర్‌వో శ్రీనివాసరావు, ఆర్డీవోలు ఆయీషా, వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:30 AM