అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:42 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హితవు పలికారు.
అధికారులకు ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ హితవు
పీజీఆర్‌ఎస్‌లో 79 వినతుల స్వీకరణ
పాడేరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హితవు పలికారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసంలో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తమ సమస్యలపై వినతులు సమర్పించేందుకు వచ్చే ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యను పక్కాగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే అధికారులకు వినతులు సమర్పించే పరిస్థితులు కల్పించవద్దన్నారు. అర్జీదారులు సమర్పించిన వినతులు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు కాల్ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 79 వినతులు
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఆర్‌వో పి.అంబేడ్కర్, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు ప్రజల నుంచి 79 వినతులను స్వీకరించారు. తన ఏకైక కుమారుడు రైవాడ జలాశయంతో ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడని, దీంతో జీవనం సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నానని, తనకు ఉపాధి కల్పించాలని అనంతగిరి మండలం జీనబాడు గ్రామానికి చెందిన గాలి పార్వతమ్మ కోరగా, హుకుంపేట మండలం బి.బొడ్డాపుట్టులో పంచాయతీ భవనం నిర్మించాలని కె.బసవన్న, కె.సింహాచలం కోరారు. పెదబయలు మండలం తాడిపుట్టులో సోలార్ ఆధారిత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని పి.ప్రసాద్, కె.బసవన్న కోరగా, అదే మండలంలోని తారాబు జలపాతాన్ని అభివృద్ధి చేసి, తారురోడ్డు నిర్మించి, తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూరిరాముడు, బాబూరావు, సత్యారావు, మంగళవారం తదితరులు కోరారు. పాడేరు, హుకుంపేట మండలాల్లోని అర్హులైన గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు, సామాజిక పెన్షన్లను మంజూరు చేయాలని ఆదివాసీ మహాసభ ప్రతినిధులు కె.ధనలక్ష్మి వినతిపత్రం సమర్పించగా, కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తి గ్రామానికి ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయాలని గ్రామస్థులు డి.అప్పారావు, ఎం.సత్యనారాయణ కోరారు. హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ సమిలిగూడ నుంచి పిట్టగూడ గ్రామానికి రోడ్డు నిర్మించాలని పాంగి వెంకటరావు కోరగా, పెదబయలు మండలం సీకరి పంచాయతీ బయలువీధి నుంచి సీకరి వరకు రోడ్డు నిర్మించాలని సిద్దేశ్వరరావు, ఈశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ సంస్థ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ వీఏ.స్వామినాయుడు, డీఈవో కె.రామకృష్ణారావు, జిల్లా పరిశ్రమల శాఖాధికారి ఆర్‌వీ.రమణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీవీ.పరిమిళ, భూగర్భ జలవనరుల శాక డీడీ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, డీడీవో జయరాజ్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి.ప్రసాద్, సీపీవో ప్రసాద్, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.