వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:02 PM
పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ హెచ్చరించారు.
అధికారులకు జాయింట్ కలెక్టర్ శ్రీపూజ హెచ్చరిక
అర్జీలు పరిశీలించి గడువులోగా పరిష్కరించాలి
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 226 వినతులు స్వీకరణ
పాడేరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం(మీకోసం)లో ఆమెమాట్లాడారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్ సేవలపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నదని, ఈ క్రమంలో అధికారులు పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రతి అధికారి సమగ్ర సమాచారంతో పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని, ఏదైనా కారణంతో హాజరుకాలేకుంటే ముందస్తు అనుమతి పొందాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారులు, సోమవారం మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు మండల స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలన్నారు. మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌లో గ్రామ స్థాయి సమస్యలను పరిష్కరిస్తే, వారంతా జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ గిరిజనుల నుంచి 226 వినతులను స్వీకరించారు. అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు ప్రజలు 1100 నంబర్ కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలని జేసీ శ్రీపూజ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠరావు, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, డీఎంహెచ్‌వో రియాజ్‌భేగ్, డీఈవో భానుమూర్తిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి వి.రమణారావు, జిల్లా టూరిజం ఆఫీసర్ పి.చలపతిరావు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, పీజీఆర్‌ఎస్ అసిస్టెంట్ నోడల్ అధికారి వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.