నిర్వహణపై నిర్లక్ష్యం!
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:44 AM
నగరసుందరీకరణతో పాటు ప్రజారోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జాతీయ రహదారి వెంబడి గ్రీన్‌బెల్ట్‌లో జీవీఎంసీ పార్కులు, వాకింగ్‌ట్రాక్‌లు, ఓపెన్‌జిమ్‌లు, ప్లే ఏరియాలు, సింథటిక్ షటిల్‌కోర్టులను ఏర్పాటుచేసింది.
రూ.కోట్లు వెచ్చించినా ఫలితం శూన్యం
జాతీయరహదారి వెంబడి గ్రీన్‌బెల్ట్‌లో అట్టాహాసంగా అభివృద్ధి
సుమారు రూ.35 కోట్లతో 45 చోట్ల పార్కులు
సుందరీకరణ, వాకింగ్‌ట్రాక్‌లు, ప్లే ఏరియాలు, ఓపెన్‌జిమ్‌ల ఏర్పాటు
నిర్వహణ కరవై పాడైన గ్రీన్‌బెల్ట్ ఫెన్సింగ్‌లు, సింథటిక్ షటిల్ కోర్టులు
(విశాఖపట్నం,ఆంధ్రజ్యోతి)
నగరసుందరీకరణతో పాటు ప్రజారోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జాతీయ రహదారి వెంబడి గ్రీన్‌బెల్ట్‌లో జీవీఎంసీ పార్కులు, వాకింగ్‌ట్రాక్‌లు, ఓపెన్‌జిమ్‌లు, ప్లే ఏరియాలు, సింథటిక్ షటిల్‌కోర్టులను ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించి, అందుబాటులోకి తెచ్చినా నిర్వహణను గాలికి వదిలేయడంతో అవన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతున్నాయి. ఏళ్ల కిందట అద్భుతంగా కనిపించినవన్నీ ఇప్పుడు కళావిహీనంగా మారిపోవడంతో నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలో జాతీయ రహదారి వెంబడి కొంత స్థలాన్ని గ్రీన్‌బెల్ట్‌గా కేటాయించారు. అయితే చాలాచోట్ల ఆక్రమణలకు పాల్పడి దుకాణాలు, ఇతర వ్యాపారాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది. మరోవైపు ఆక్రమణదారులు గ్రీన్‌బెల్ట్‌లోని చెట్లను తొలగించడంతో పచ్చదనం తగ్గిపోయింది. దీంతో గ్రీన్‌బెల్ట్‌లోని చెట్లను తొలగించకుండానే పార్కులు అభివృద్ధిచేయడం, అందమైన కళాఖండాలను ఏర్పాటుచేయడం ద్వారా నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ రంగంలోకి దిగింది. వాకింగ్‌ట్రాక్‌లు, ఓపెన్‌జిమ్‌లు, ప్లే ఏరియాలు, సింథటిక్ షటిల్ కోర్టులను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలకు శారీరక వ్యాయామం చేసుకునే వేదికలుగా మార్చవచ్చని భావించింది. ఇందుకోసం రెండేళ్లలో దశలవారీగా మద్దిలపాలెం జంక్షన్‌లోని సీఎంఆర్‌సెంట్రల్ నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ వరకు పదికిలోమీటర మేర సుమారు 45 ప్రాంతాల్లో దాదాపు రూ.35 కోట్లు వెచ్చించి గ్రీన్‌బెల్ట్ సుందరీకరణ, పార్కులు, ఆటస్థలాలు, జిమ్‌ల అభివృద్ధి పనులు పూర్తిచేశారు. పశువులు చొరబడకుండా ఎంఎస్ పైప్‌లతో ఫెన్సింగ్ ఏర్పాటుచేసి అందమైన రంగులు అద్దారు. పలుచోట్ల చిన్నపిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియాపేరుతో అనేకరకాల ఆటపరికరాలను ఏర్పాటుచేశారు. పెద్దవారు ఆడుకునేందుకు వాలీబాల్‌కోర్టులు, సింథటిక్ షటిల్‌కోర్టులు అందుబాటులోకి తెచ్చారు. గ్రీన్‌బెల్ట్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నివసించే వారి సౌలభ్యం కోసం వాకింగ్‌ట్రాక్‌లు రూపొందించారు. వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళ పచ్చనిచెట్ల మధ్య కూర్చొని ప్రశాంతంగా గడిపేందుకు సిమ్మెంట్ బెంచీలు వేశారు. దీంతో గ్రీన్‌బెల్ట్‌ల స్వరూపం మారిపోయి జీవీఎంసీ అధికారుల చర్యలు ప్రశంసలందుకున్నాయి. రూ.వేలు ఫీజులు చెల్లించి జిమ్‌లకు వెళ్లలేని పేద, మధ్యతరగతి ప్రజలు ఉచితంగా ఇంటికి సమీపంలోనే ఓపెన్‌జిమ్‌లో వ్యాయామం, ట్రాక్‌లపై వాకింగ్ చేసుకోవడం ప్రారంభించారు. దీనివల్ల ప్రజారోగ్యం మెరుగుపడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జీవీఎంసీ అధికారుల ఆలోచన, కృషిని నగరవాసులతోపాటు ఇతరప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు సైతం అభినందించారు.
నిర్వహణ లేక మూలకు..
అట్టాహాసంగా ఏర్పాటుచేసిన ఓపెన్‌జిమ్ పరికరాలు, సింథటిక్ షటిల్‌కోర్టులు, గ్రీన్‌బెల్ట్‌కు రక్షణగా ఏర్పాటుచేసి ఎంఎస్‌గ్రిల్ ఫెన్సింగ్‌ల నిర్వహణను జీవీఎంసీ గాలికి వదిలేసింది. దీంతో ఒక్కొక్కటిగా మూలకు చేరుతూ నిరుపయోగంగా మారుతున్నాయి. ముస్లింతాటిచెట్లపాలెం వద్ద ఏర్పాటుచేసిన సింథటిక్ షటిల్‌కోర్టులో గుంతలు పడిపోవడంతో ఆడుకోవడానికి వీల్లేకుండాపోయింది. గుంతల్లో కాలు పడితే గాయపడుతున్నామని క్రీడాకారులు వాపోతున్నారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన కోర్టు వృథాగా మారింది. అక్కయ్యపాలెం పోర్టు ఆస్పత్రి ఎదురుగా గ్రీన్‌బెల్ట్‌కు రక్షణగా ఏర్పాటుచేసిన ఎంఎస్‌గ్రిల్ ఫెన్సింగ్‌ను వాహనాలు ఢీకొట్టడంతో వంగిపోయాయి. దీంతో పశువులు గ్రీన్‌బెల్ట్‌లోకి చొరబడి మొక్కలను నాశనం చేస్తున్నాయి. చాలాచోట్ల ఏర్పాటుచేసిన ఓపెన్‌జిమ్ పరికరాలకు గ్రీజ్ పెట్టకపోవడంతో పాడవుతున్నాయి. తాటిచెట్లపాలెం సంజీవ్‌గాంధీనగర్ సమీపంలోని ఓపెన్‌జిమ్ పరికరాల విడిభాగాలు లూజైపోవడంతో ప్రజలు వ్యాయామం చేయడం మానేశారు.