Share News

మేహాద్రిగెడ్డ గేట్లపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Jan 25 , 2026 | 01:14 AM

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతు వ్యవహారం ముందుకుసాగడం లేదు.

మేహాద్రిగెడ్డ గేట్లపై నిర్లక్ష్యం

మరమ్మతుకు ముహూర్తమెన్నడో

రూ.5.7 కోట్లతో ప్రతిపాదనలు

ఇంకా రాని అనుమతులు

రిజర్వాయర్‌ను జీవీఎంసీకి అప్పగించేందుకు ప్రభుత్వం విముఖం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతు వ్యవహారం ముందుకుసాగడం లేదు. ఆరు గేట్లలో నాలుగు గేట్ల మరమ్మతు, నిర్వహణకు సంబంధించిన వ్యవస్థను సరిదిద్దేందుకు రూ. 5.7 కోట్లతో జల వనరుల శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఏటా వర్షాకాలంలో ఈ అంశం తెరమీదకు వస్తుంది. ఆ తరువాత దాని సంగతే మరిచిపోతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

జల వనరుల శాఖ ఆఽధీనంలో ఉన్న మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను జీవీఎంసీకి అప్పగించాలని గత ఏడాది జరిగిన డీఆర్‌సీ సమావేశంలో తీర్మానించారు. మరోవైపు పోలవరం ఎడమ కాలువ ద్వారా నగరానికి వచ్చే అదనపు నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసేలా సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు అవసరమైన నిధులను జీవీఎంసీ విడుదల చేస్తుందని కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ ఈ సమీక్షలో వెల్లడించారు. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతుకు జల వనరుల శాఖ స్థానిక అధికారులు రూ.5.7 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి, నూజివీడులో గల మెకానికల్‌ విభాగానికి పంపారు. మెకానికల్‌ విభాగం అధికారులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ జిల్లా జల వనరుల శాఖకు నోట్‌ పంపారు. ఈ నోట్‌ మేరకు వివరణ ఇస్తూ ఇక్కడ నుంచి తిరిగి ప్రతిపాదన పంపారు. అయితే ఇంతవరకూ మెకానికల్‌ విభాగం నుంచి ఆమోదం రాలేదు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రతిపాదనల మేరకు నిధుల కోసం జీవీఎంసీకి కూడా నివేదించాల్సి ఉంది. ఒకేసారి రూ.5.7 కోట్లు విడుదల చేయడం జీవీఎంసీకి సాంకేతికంగా వీలుపడదు. ఏ మేరకు నిధులు ఇస్తుందో...దానికి అనుగుణంగా గేట్ల మరమ్మతుకు టెండర్లు పిలవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే కాంట్ర్టాక్టర్‌ పనులు పూర్తి చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే మరమ్మతులు పూర్తి కావాలంటే జల వనరుల శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నూజివీడులోని మెకానికల్‌ విభాగానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి. ఇదిలావుండగా నిధుల విడుదలపై సీఎం సమక్షంలో కలెక్టర్‌ ప్రకటన చేసినా ఇంతవరకూ జీవీఎంసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను జీవీఎంసీకి అప్పగింతకు సీఎం సుముఖంగా లేరని అంటున్నారు. జల వనరుల శాఖ ఆధీనంలోనే రిజర్వాయర్‌ కొనసాగింపునకు మొగ్గుచూపుతున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 01:14 AM